వైఎస్ కుటుంబం అంటేనే బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆది నుంచి కూడా అండగా ఉన్న ఫ్యామిలీ. అప్పట్లో రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నా.. ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నా.. వారి వ్యూహం మొత్తంగా ఎస్సీ, ఎస్టీల వైపే మొగ్గు చూపుతుంది. వారి పాలనలో మెరుపులు అన్నీ కూడా బడుగులు, బలహీన వర్గాలకు అనుకూలంగా మెరిసేవే. మరీ ముఖ్యంగా మైనార్టీల విషయంలో గతంలో రాజశేఖరెడ్డి,, ఇప్పుడు జగన్ కూడా సానుకూల దృక్ఫథంతోనే ముందుకు సాగుతున్నారు. మైనార్టీలకు గతంలో రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 4% రిజర్వేషన్ కల్పించింది. అదేసమయంలో వారికి అండగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. పదవులు కూడా అప్పగించింది.
ఇక, ఇప్పుడు జగన్ సర్కారు కూడా మైనార్టీ నేతలకు ప్రాధాన్యం ఇస్తోంది. మైనార్టీ కుటుంబాలకు ప్రాధాన్యం ఇస్తోంది. మైనార్టీ నేత, కడప ఎమ్మెల్యే అంజాద్ భాషాకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు.. జగన్. ఇక, ఇప్పుడు తాజాగా మైనార్టీల ప్రధాన డిమాండ్‌ను కూడా నెరవేర్చారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్‌ఆర్‌సీ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్)ని అమలు చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే విధంగా ఈ అంశానికి సంబంధించి గతంలో ప్రకటించిన విధానానికే కట్టుబడి ఉన్నామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు సంబంధించి అసెంబ్లీలోనే తీర్మానాన్ని ఆమోదించింది.
వాస్తవానికి ఎన్ పీఆర్–2020 (నేషనల్ పాపులేషన్ ఆఫ్ రిజిస్టర్)లో కొత్తగా చేర్చిన అంశాలతో ముస్లింలలో భయాందోళనలు పెరిగాయి. అందువల్ల 2010 నాటి ఫార్మట్ ప్రకారమే ఎన్‌పీఆర్ అమలు చేయాలని మైనార్టీ వర్గాల నుంచి గత కొన్నాళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా మైనార్టీ వర్గాలు ఆందోళన కూడా చేశాయి. ఈ క్రమంలో.. రాష్ట్రంలో ఈ ఈ విషయం కొన్నాళ్ల కిందట రాజకీయం అయింది. ఈ విషయంపై జగన్ ప్రభుత్వ వైఖరేంటని ప్రతిపక్ష నేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎందుకంటే..కేంద్రం తీసుకువచ్చిన ఈ బిల్లు ద్వారా జగన్‌ను ఇరుకున పెట్టాలనేది ఆయన వ్యూహం.
ఎందుకంటే.. కేంద్రంలోని బీజేపీతో జగన్ ప్రభుత్వం అనుకూలంగా ఉంది. అయినప్పటికీ.. జగన్ మైనార్టీ పక్షానే నిలబడ్డారు. మైనారిటీలలో నెలకొన్న అభద్రతా భావం తొలగించి, వారిలో మనోధైర్యం నింపేందుకు జగన్ ప్రయత్నించారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్‌ఆర్‌సీని అమలు చేయబోమని గతంలోనే ఆయన స్పష్టం చేశారు. ఇక, ఇప్పుడు అసెంబ్లీ వేదికగా మరోమారు స్పష్టం చేశారు. దీంతో వైఎస్ జగన్ అనే ఆయనను మైనార్టీ జగన్ అని పిలుచుకునేందుకు ఆ వర్గం రెడీ అవడం విశేషం.