పులివెందుల‌లో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌రాల వ‌ర్షం..

-

కడప జిల్లాలో తన మూడో రోజు పర్యటనలో భాగంగా పులివెందులలో పర్యటిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్, సొంత నియోజకవర్గంపై వరాల వర్షం కురిపించారు. ఈ ఉదయం సీఎస్ఐ చర్చిలో ప్రార్థనల అనంతరం వందల కోట్ల విలువైన పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయడంతో పాటు, ఇప్పటికే నిర్మితమైన భవనాలను ప్రారంభించారు. పట్టణంలో నిర్మించిన వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ను జగన్ ప్రారంభించారు. అలాగే పులివెందుల మునిసిపాలిటీ పరిధిలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ కోసం రూ. 100 కోట్ల నిధులను ప్రకటించారు. ఇంటింటికీ నీరందించే సమీకృత పథకానికి తక్షణం రూ. 65 కోట్లను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు.

వేంపల్లిలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులకు రూ. 63 కోట్లను ప్రకటించారు. జేఎన్‌టీయూలో కోట్లతో లెక్చరర్‌ కాంప్లెక్స్, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ల కోసం రూ. 20 కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. పులివెందులలో మోడల్ పోలీస్ స్టేషన్ ను నిర్మిస్తామని తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక సంస్థల కాలేజీల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమీ కోసం రూ. 17.50 కోట్లను మంజూరు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఈ అకాడమీలో 14 రకాల క్రీడలకు ఉచితంగా శిక్షణ అందిస్తారని తెలిపారు. ఇడుపులపాయ పర్యాటక సర్క్యూట్ కోసం రూ. 20 కోట్లను, పులివెందుల మినీ సచివాలయానికి రూ. 10 కోట్లను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news