ఏ బుల్లెట్టూ… దీన్ని ఏం చేయలేదు

-

మేజర్‌ అనూప్‌ మిశ్రా 2014లో కాశ్మీర్‌ లోయలో బుల్లెట్‌ దెబ్బ తిన్నాడు. అదృష్టవశాత్తు  పెద్ద గాయాలేంకాకపోయినా, దెబ్బ బలంగా తగలడం వల్ల అతను కొన్ని రోజులు కోమాలో ఉన్నాడు.

మెడ నుండి కాలి చీలమండ వరకు రక్షణ కల్సించే సరికొత్త బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ను భారత మిలిటరీ తయారుచేసింది. దీన్ని ‘సర్వత్ర కవచ్‌’ గా పిలుస్తున్నారు. తూటా గాయంతో కోమాలోకి వెళ్లిన మిలిటరీ మేజర్‌అనూప్‌ మిశ్రా దీన్ని తయారుచేసారు.

సర్వత్ర కవచ్‌ను రూపొందించినందుకుగాను, మేజర్‌ మిశ్రాను, ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ డిజైన్‌ బ్యూరో ఎక్స్‌లెన్స్‌ అవార్డుతో సత్కరించారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారుకాబడిన ఈ జాకెట్‌ అన్ని రకాల బుల్లెట్‌ దెబ్బలను తట్టుకుంటుంది. చాలా శక్తివంతమైన స్నైపర్‌ రైఫిల్‌ బుల్లెట్‌తో సహా, అత్యంత సమీపం నుండి కాల్చినా, దీన్ని ధరించినవారికి ఏమీ హాని జరగదు. ప్రస్తుతం పుణెలోని మిలిటరీ ఇంజనీరింగ్‌ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న మేజర్‌ మిశ్రా, తనకు తగిలిన బుల్లెట్‌ దెబ్బవల్ల ఈ పరిశోధనకు పూనుకుని దుర్భేధ్యమైన కవచాన్ని తయారుచేసారు. 2017లోనే దీని తయారీకి మిలిటరీ ప్రత్యేక అనుమతినిచ్చింది. మెడ నుండి కాళ్ల వరకు, మోచేతులనుండి భుజాల వరకు ఇది రక్షణ కల్పిస్తుంది. ఇంత కవరేజి ఇచ్చే జాకెట్‌ ఇప్పటివరకు ప్రపంచంలోనే లేదు.

ఎడిబి – ఆర్మీ డిజైన్‌ బ్యూరో.. రక్షణ దళాలకు అవసరమయ్యే ప్రత్యేక పరికరాలను, సాంకేతికతను అభివృద్ది పరిచేందుకు ఈ సంస్థను ఆర్మీ నెలకొల్పింది. అంతేకాకుండా, ఇతర సంస్థలు తయారుచేసే ఉపకరణాలను పరిశీలించడం, మిలిటరీ కాలేజీలకు పరిశోధన కోసం విషయాలను సిద్ధం చేయడం దీని బాధ్యతలు. డిఆర్‌డిఓ, ఇతర రక్షణ సంబంధిత కళాశాలలు సైన్యం వినియోగించే అత్యాధునిక సాంకేతికతపై ఎప్పటికప్పుడు పరిశోధన సాగిస్తూఉంటాయి. ప్రస్తుతం కృత్రిమ మేధ వినియోగం, లేజర్‌ కిరణాలతో శత్రునాశనం లాంటి ప్రయోగాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news