ఏపీలో వరుస సంక్షేమ పథకాలతో దూసుకుపోతోన్న జగన్ సర్కార్ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పేసింది. జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కీలకమైన నవరత్నాల్లో పేదలందరికి ఇళ్ల పంపిణీకి సంబంధించి కొత్త రూల్స్‌ను జారీ చేశారు. పేదవాళ్లందరికి పట్టణాల్లో ఒక సెంటు భూమి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణాల్లో ప్రతి ఒక్క పేద వ్యక్తికి ఒక సెంటు భూమి ఇవ్వడం వల్ల ఎకరానికి 55 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వవచ్చన్న ప్లాన్‌లో ఉంది.
జీ+3( గ్రౌండ్ ఫ్లోర్ + 3 అంతస్థుల) అపార్ట్‌మెంట్లను నిర్మించి.. అందరికి ఫ్లాట్లు ఇవ్వాలని చూస్తోంది. ఇక ఈ పథకానికి అర్హులు అయిన వారు తమ రేషన్ కార్డు జిరాక్స్ ప్రూఫ్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. రేషన్ కార్డు లేనివారు కూడా మీ సేవ ద్వారా ఆదాయ ధృవీకరణ పత్రం అందజేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక ఈ పథకానికి అర్హులను ఎంపిక చేసి వచ్చే ఉగాది నాటికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నదే జగన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మునిసిపాల్టీల్లో ఖాళీగా ఉన్న భూములను గుర్తించే ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. అక్రమాలకు తావు లేకుండా ఇళ్ల స్థలాలు కేటాయించే క్రమంలో ఎక్కడికక్కడ వారి ఆధార్ నెంబర్, రేషన్ కార్డు వివరాలు దానితో లింక్ చేస్తారు.. ఇక ఈ భూమిని వచ్చే ఐదేళ్ల వరకు కూడా ఎవ్వరికి అమ్మడానికి వీలు లేదు. ఐదేళ్ల తర్వాత మాత్రమే నాన్ అబ్జెక్షన్ సర్టిఫికెట్(NOC) అవసరం లేకుండా ఎవరికైనా అమ్ముకోవచ్చునని సమాచారం. కాగా, స్థలాలు పొందిన లబ్ధిదారుల వివరాలను వార్డు, గ్రామ సచివాలయాల్లో పొందుపరుస్తారు.