ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సాధారణ ప్రజల్లోనూ ఇదే ప్రశ్న వినిపిస్తోంది. జగన్‌కు, దివంగత వైఎస్‌కు అత్యంత సన్నిహితులు, గతంలో వైఎస్ హయాంలోనూ మంత్రులుగా చక్రం తిప్పిన వారు.. ఇప్పుడు ఏమవుతారు? అనేది పెద్ద సందేహం. దీనికి కారణం.. తాజాగా శాసన మండలి రద్దు చేస్తూ.. జగన్ ప్రభుత్వం తీర్మానం చేయడం, దానిని కేంద్రానికి పంపడమే. కేంద్రం వద్ద ఎలాగూ జగన్ తనపలుకుబడిని వినియోగిస్తారు కాబట్టి మహా అయితే.. మరో రెండు మూడు మాసాల్లోనే రాష్ట్రం చేసిన తీర్మనానికి కేంద్రం కూడా పచ్చజెండా ఊపే అవకాశం కనిపిస్తోంది.
ఇదే జరిగితే.. మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు పదవులు కోల్పోవడం ఖాయం.
వారే.. ఒకరు పిల్లి సుభాష్ చంద్రబోస్, మరొకరు మోపిదేవి వెంకట రమణ. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఇద్దరూకూడా వైసీపీ తరఫున పోటీ చేశారు. అయితే, జగన్ సునామీ జోరులోనూ ఈ ఇద్దరూ ఓడిపోయారు. సుభాష్ చంద్రబోస్.. తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి పోటీ చేసి ఓడిపోగా, మోపిదేవి గుంటూరు జిల్లా రేపల్లె నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
అయినా కూడా జగన్ వీరిద్దరికీ తన కేబినెట్‌లో చోటు కల్పించారు. అప్పటికే ఎమ్మెల్సీగాబోస్ ఉండడంతో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఇక, మోపిదేవికి కొత్తగా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి, ఆయనను మండలికి పంపించి మరీ మంత్రిగా ప్రమోట్ చేసుకున్నారు. అయితే, ఇప్పుడు మండలి రద్దుతో ఈ ఇద్దరి పరిస్థితి ఏంటనేది తీవ్రమైన చర్చ. మండలి ఎలాగూ ఉండదు కనుక, వారిని మంత్రులుగా కొనసాగించాలంటే.. ఉన్న ఏకైక మార్గం.. వారిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవాలి. ఇప్పుడున్న పరిస్తితిలో ఈ ఇద్దరినీ ఎమ్మెల్యేలుగా గెలిపించుకునేందుకు ఉన్న మార్గాలు అన్వేషించడం కూడా కష్టమే.
ఎన్నికలు ముగిసి.. ఏడు మాసాలే అయిన నేపథ్యంలో నియోజకవర్గాల్లో పెద్దగా ఎక్కడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. సో.. ఎక్కడ నుంచి పోటీ చేసినా.. ఫలితం ఆశించిన విధంగా ఉంటుందా? అనేది ప్రశ్నార్థకమే. పైగా విపక్షాల మూకుమ్మడి దాడి కూడా ఒకటి ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో మండలి రద్దయ్యే వరకు వీరిని కొనసాగించి.. అనంతరం కీలకమైన నామినేటెడ్ పదవులు అప్పగిస్తారని అంటున్నారు. లేదా.. పార్టీలో ప్రధానపదవులు అప్పగిస్తారనే వాదన వినిపిస్తోంది. మొత్తానికి మండలి రద్దుతో ఈ ఇద్దరూ ఒకింత కుదుపునకు గురయ్యారనేది వాస్తవం.