ఏపీ అధికార పక్షం వైసీపీలోకి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచి భారీ ఎత్తున చేరికలు సాగుతున్నాయి. నాయ కులు పోటీ పడి మరీ వైసీపీ కండువా కప్పుకొనేందుకు పోటెత్తుతున్నారు. అయితే, ఈ పరిణామాలు ఆ పార్టీ లోని సీనియర్లకు ఒకింత ఇబ్బందిగా పరిణమించాయి. మా నాయకుడు కొంచెం ఆలోచించుకుంటే బెటర్ అని వారు చెబుతున్నారు. మరి ఎందుకు ఇలా అంటున్నారు? టీడీపీ తుడిచి పెట్టుకుపోతే.. వైసీపీ సంతోషించాలి కదా? అలా కాకుండా నాయకులు ఎందుకు డీలా పడుతున్నారు? అనే ప్రశ్న వేధిస్తోంది. దీనికి ప్రధాన కారణం.,. కూడా వారే చెబుతున్నారు.
గతంలో టీడీపీ కూడా వైసీపీ నుంచి వచ్చిన వారిని వచ్చినట్టు తీసుకుంది. దీనిలో వైసీపీని అణగదొక్కాల నే ప్రయోజనం తప్ప మరొకటి కనిపించలేదు. అయితే, అనుకున్నది అప్పటి సీఎం, ఇప్పుడు మాజీ సీఎం చంద్రబాబు ఏమైనా సాధించారా? అంటే లేదనే చెప్పాలి. ఈ క్రమంలో ఇప్పుడు పార్టీలో చాలినం త మంది నాయకులను ఉంచుకుని టీడీపీ నుంచి ఆహ్వానించడం వల్ల ప్రయోజనం ఉండదని చెబుతు న్నారు. పైగా.. వీరంతా కూడా ఇప్పుడు గతంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు లేదా కేసుల నుంచి ఉపశమనం పొందేందుకు ఇలా పార్టీ మారుతున్నారని, రేపు ఏ చిన్న భరోసా లభించినా.. కూడా తిరిగి సైకిలెక్కేస్తారని అంటున్నారు.
అంతేకాదు, కొందరు నాయకులు చంద్రబాబు కనుసన్నల్లోనే పార్టీ మారుతున్నారనే వాదన ను కూడా వైసీపీ నాయకులు చెబుతున్నారు. టీడీపీలో ఉండగా సత్తా చూపించలేక పోయిన వారు కూడా ఇప్పుడు వైసీపీలోకి చేరుతున్నారని అంటున్నారు. ఈ పరిణామాలతో అన్ని నియోజకవర్గాల్లోనూ రెండు అధికార కేంద్రాలు ఏర్పడడం ఖాయమని అంటున్నారు(అంటే ఒకరు గెలిచిన నాయకుడు, మరొకరు ఓడిన నాయకుడు ఇప్పుడు ఇద్దరూ వైసీపీలోనే ఉన్నట్టు). దీనివల్ల తరచుగా కీచులాటలు ఏర్పడడంతోపాటు పార్టీ బలహీన పడే ప్రమాదం కూడా ఉంటుందని సూచిస్తున్నారు.
నాయకులను తీసుకున్నంత మాత్రాన టీడీపీ బలహీన పడుతుందనే ఆలోచన కూడా కరెక్ట్ కాదని అంటున్నారు. రేపో మాపో వీళ్ల కలహాల వల్ల టీడీపీ ఎలా మునిగిందో వైసీపీ కూడా అలాగే మునిగిపోతుందని జగన్ ఈ విషయంలో వెంటనే ఎలెర్ట్ అయ్యి అనవసర నాయకులను పార్టీలోకి చేర్చుకోకూడదని అంటున్నారు. మరి ఈ విషయంలో జగన్ వ్యూహం ఏంటో చూడాలి.