రాష్ట్రంలో మూడు రాజధానుల రగడ కేవలం ప్రజల్లోనో.. ప్రతిపక్షంలోనే ఉందనుకుంటే.. పొరపాటే అంటున్నారు వైఎస్సార్ సీపీ నాయకులు. ఒకింత ఆశ్చర్యంగా, ఆసక్తిగా ఉన్న ఈ విషయం తాజాగా వెలుగు చూసింది. ఒకవైపు ఈ మూడు ప్రతిపాదనపై గుంటూరు జిల్లాలో గడిచిన ఆరు మాసాలుగా తీవ్ర ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక, ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కూడా రాజధాని సెగ కూడా భారీగానే పెరిగింది. చాలా వరకు టీడీపీ ఈ రాజధాని విషయాన్ని తీవ్రంగా తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై పార్టీ నేతలు తీవ్రస్థాయిలో జగన్ సర్కారుపై యుద్ధమే ప్రకటిస్తున్నారు.
ఇక, ఈ రగడ అధికార పార్టీలో లేదని, కేవలం ప్రతిపక్షాలకు మాత్రమే పరిమితమని నిన్న మొన్నటి వరకు కూడా అందరూ అనుకున్నారు. కానీ, అధికార పార్టీలోనూ మూడు రాజధానులపై గుంభనంగానే ఉన్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లా వైఎస్సార్ సీపీ నాయకులు ఈ విషయంపై పైకి ఏమీ మాట్లాడకపోయినా.. లోలోన మాత్ర మథన పడుతున్నారు. “మా నాయకుడు పట్టిన పట్టు విడిచిపెట్టే టైపు కాదు. మేం ఏమన్నా అంటే.. ధిక్కరిస్తున్నావా? అంటూ దాడి చేయడం ప్రారంభిస్తారు. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై మాకు నమ్మకం లేదు. ఇప్పుడు గెలిచిందే గెలుపు. మా నాయకుడికి వద్దని చెప్పినా.. వినే స్థితిలో ఆయన లేరు. పైగా వెళ్లి టీడీపీలో చేరు అంటున్నారు“ అని పశ్చిమ గోదావరికి చెందిన ఓ కీలక నాయకుడు వ్యాఖ్యానించారు.
ఇక, గుంటూరుకు చెందిన మంత్రితో సహా కొందరు ఈ విషయంపై ఏమీ మాట్లాడడం లేదు. ఏదో తమ పనితాము చేసుకుపోతున్నారు తప్ప.. రాజధాని విషయంపై ఎవరూ మాట్లాడడం లేదు. ఇటీవల ఒకరిద్దరు ఆఫ్ దిరికార్డుగా మాట్లాడుతూ.. “రాజధాని ఇక్కడ ఉంటేనే బెటర్. చంద్రబాబు శంకుస్థాపన చేశాడనే ఒక్క కారణం తప్ప.. డెవలప్ చేస్తే.. మనకే పేరు ఉండేది. అప్పట్లో ఔటర్ రింగ్ రోడ్డును చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కానీ, వైఎస్ హయాంలోకి వచ్చాక దీనిని పూర్తి చేసి.. దీనికి ఎందరు కాదన్నా.. పీవీ ఎక్స్‌ప్రెస్ వే అంటూ పేరు పెట్టారు.
పైగా ప్రారంభించిన క్రెడిట్ వైఎస్‌కే కదా దక్కింది. అయినా.. మా నాయకుడికి ఇవన్నీ తెలియవా?“ అని అంటున్నారు. దీనిని బట్టి నాయకులు ఎంత గుబులుగా ఉన్నారో అర్ధమవుతోంది. ఏదేమైనా రాజధాని విషయంలో పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉండడం జగన్‌కు పెద్ద తలనొప్పిగానే మారనుందన్న చర్చలు కూడా నడుస్తున్నాయి.