ఏ రాజకీయ నాయకుడైన ప్రజల్లో ఉండాలి.. ప్రజల కోసం పనిచేయాలి.. ఏదో ఎన్నికల సమయంలోనే ప్రజల్లో ఉండటమే కాకుండా.. గెలిచాక కూడా ప్రజల మధ్య తిరుగుతూ, ప్రజల బాగోగులని పట్టించుకోవాలి.. అలా చేయకపోతే ప్రజలే నాయకులని బాగా పట్టించుకుని, వారిని ఎన్నికల్లో ఓడించి పక్కన పెడతారు..అలాగే అప్పుడప్పుడు మొక్కుబడిగా కనిపించిన సరే ప్రజలు తిరగబడే పరిస్తితి ఉంటుంది. గతంలో మాదిరిగా ప్రజలు.. ఎమ్మెల్యే, మంత్రి అని గౌరవం ఇస్తూ ఉండటం లేదు.. ఏదైనా సమస్య ఉంటే రోడ్డు మీద నిలబెట్టి మరీ ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే తమ సమస్యల పరిష్కారం కోసం నాయకులని అడ్డుకుంటున్నారు.
ఇప్పుడు ఏపీలో ఇదే సీన్ నడుస్తోంది..అధికారంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు జనం చుక్కలు చూపిస్తున్నారు..ఎన్నికలై మూడేళ్లు అయిపోయాయి..అయితే ఈ మూడేళ్ళ సమయంలో మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని పెద్దగా జనంలోకి వెళ్ళి వాళ్ళ సమస్యలని పరిష్కరించిన సందర్భాలు తక్కువ..ఏదో కొంతమంది మాత్రమే జనంలో తిరిగారు. అయితే మెజారిటీ ప్రజా నాయకులు ప్రజల్లోకి రాలేదు. ఇక చివరికి ఇటీవల సీఎం జగన్ క్లాస్ పీకి.. గడప గడపకు ప్రజా ప్రతినిధులు వెళ్లాలని చెప్పడంతో…గడప గడపకు మన ప్రభుత్వం పేరిట.. ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రులు ప్రజల్లోకి వస్తున్నారు. ఊర్లు పట్టుకుని తిరుగుతున్నారు.
అయితే ప్రజా ప్రతినిధులు ప్రజల కోసం ఏమైనా చేస్తే ఇబ్బంది లేదు.. కానీ ఏమి చేయకుండా తిరిగితే మాత్రం ప్రజలు ఊరుకోరు కదా.. అందుకే ఇప్పుడు ఎక్కడకక్కడ వైసీపీ ఎమ్మెల్యేలని, మంత్రులని.. ప్రజలు రోడ్డు మీద నిలబెట్టి మరీ తమ సమస్యలని పరిష్కరించాలని కోరుతున్నారు. పథకాలు సరిగ్గా అందడం లేదని, తాగునీటి కొరత.. ముఖ్యంగా రోడ్లపై గుంతలు లాంటి అంశాలపై ప్రజాప్రతినిధులని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఇక ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలకు ఏదొకటి చెప్పి కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.. అప్పటికి వినకపోతే మాటల దాడి చూస్తే.. మీరు టీడీపీ వాళ్ళు అని చెప్పి జనంపైనే నాయకులు విమర్శలు చేసే పరిస్తితి కనిపిస్తోంది. మొత్తానికైతే వైసీపీ ‘ఫ్యాన్స్’కు జనం చుక్కలు చూపిస్తున్నారనే చెప్పొచ్చు.