గుంటూరు జిల్లాలోని కీలకమైన నరసారావుపేట పార్లమెంటు స్థానం నుంచి తొలిసారివిజయం సాధించిన ఉన్నత విద్యావంతుడు లావు శ్రీకృష్ణదేవరాయులుకు స్వపక్షంలోనే కావాల్సినంత విపక్షం ఉంది. ఆయన తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందరినీ కలుపుకొని పోతూ.. నియోజకవర్గంలో అభివృద్దికి బాటలు వేయాలని ఆయన తపిస్తున్నారు. కానీ, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంది ఆయనకు కలిసి రావడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో నియోజకవర్గంలోను, ఢిల్లీ స్థాయిలోను ఆయన దూకుడుగా ఉన్నప్పటికీ.. ప్రయోజనం కనిపించడం లేదని తెలుస్తోంది.
నరసారావుపేట నియోజకవర్గం కిందకు వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలను పరిశీలిస్తే.. పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసారావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల ఉన్నాయి. వీటిలో ఒక్క పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రమే ఎంపీకి సహకరిస్తున్నారని అంటున్నారు. మిగిలిన వారంతా కూడా ఎవరి దారిలో వారు వెళ్తున్నారని తెలుస్తోంది. నిజానికి మిగిలిన వారిలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీతోనే ఎంపీకి నేరుగా వివాదాలు నడుస్తున్నాయి. కోటప్పకొండ తిరునాళ్ల సమయంలో ఈ వివాదాలు మరింత పెరిగి..కేసుల వరకు వెళ్లాయి. ఇక చిలకలూరిపేటలో పార్టీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్, ఎంపీ లావు ఓ వర్గంగా ఉండడంతో రజనీ మరో వర్గంగా ఉంటున్నారు.
ఇక, మిగిలిన వారంతా కూడా ఎన్నికలకు ముందు .. తర్వాత కూడా ఆయనతో కలిసి ఉన్నారు. కానీ, ఇటీవల కాలంలో మాత్రం నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఎంపీతో విభేదిస్తున్నారని తెలుస్తోంది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఎంపీ సహకరించడం లేదని ఆయన ఇటీవల ఆఫ్ ది మీడియాగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఇక్కడ పార్టీలో కొన్ని సామాజిక వర్గాలను ఎంపీ చేరదీస్తుండడం ఎమ్మెల్యేకు… ఎమ్మెల్యే కొందరని చేరదీస్తుండడం ఎంపీకి నచ్చడం లేదు. ఇక్కడే ఇద్దరి మధ్య పొరా పొచ్చలు వచ్చాయంటున్నారు.
ఇక, సత్తెనపల్లి ఎమ్మెల్యే రాంబాబు కూడా ఎంపీని పట్టించుకోవడం లేదు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి కొన్నాళ్లు కలిసి ఉన్నప్పటికీ.. స్థానికంగా అభివృద్ది పనులకు నిధులు కేటాయించే విషయంలో ఎంపీతో ఆయనకు విభేదాలు వచ్చాయని ప్రచారంలో ఉంది. ఇక వినుకొండలో ఎంపీ సొంత వర్గానికే చెందిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఉన్నా ఆయనతోనూ ఎంపీకి విబేధాలు వచ్చాయి. దీంతో ఎంపీకి సహకరిస్తున్న ఎమ్మెల్యేలు తగ్గిపోయారు. ఎంపీ మాత్రం రాజకీయాలకు కొత్తే అయినా తనకు కలిసొచ్చిన ఎమ్మెల్యేలు ఉన్న చోట కలిసి వెళుతూ మిగిలిన చోట్ల తన వర్గాన్ని ప్రోత్సహించుకుంటున్నారన్న టాక్ వచ్చింది. అదే సమయంలో లావు అధిష్టానంపై సైతం కొన్ని విషయాల్లో అసంతృప్తితో ఉన్నట్టు కూడా జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.