తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్న కుల దురహంకార హత్యలను ఖండిస్తూ సీపీఎం, సీపీఐ రాష్ట్ర స్థాయి కమిటీల ఆధ్వర్యంలో విజయవాడలో బుధవారం రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉమ్మడి పార్టీల నేతలు ఓ ప్రకటన విడుదల చేశాయి.. రాష్ట్రంలో మితవాద శక్తులు బలపడుతున్నాయని, శాస్త్రీయ ఆలోచన, హేతువాదం, అభ్యుదయ భావనలపై దాడి జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రంలో ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నల్లో పనిచేస్తున్న బిజెపి ప్రభుత్వ ప్రోత్సాహంతో మతోన్మాద శక్తులకు పగ్గాల్లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేశాయి. దేశంలో భాజపా పాలిత ప్రాంతాలు, మిత్రపక్షాలుగా ఉన్నరాష్ట్రాలు ఈ తరహా హత్యలను నియంత్రించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు పి మధు, కె రామకృష్ణ, విసికె పార్టీ జాతీయ అధ్యక్షులు తిరుమావలన్ తదితరులు సదస్సులో పాల్గొననున్నట్లు తెలిపారు.