సూర్యుని కక్ష్యలో పరిభ్రమించే ఆస్టరాయిడ్లు అప్పుడప్పుడు భూమికి దగ్గరగా వస్తుంటాయి. వాటిల్లో కేవలం కొన్ని మాత్రమే భూమిని ఢీకొడుతుంటాయి. కొన్ని భూమికి సమీపంలో వచ్చి దూరంగా వెళ్లిపోతుంటాయి. ఇప్పుడు కూడా ఒక ఆస్టరాయిడ్ భూమికి అత్యంత దగ్గరగా రానుంది. మరో 24 గంటల్లో ఆ ఆస్టరాయిడ్ భూమికి దగ్గరగా వస్తుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తెలియజేసింది.
సదరు ఆస్టరాయిడ్ (గ్రహ శకలం)కు 2016 AJ193 అని పేరు పెట్టారు. ఆగస్టు 21వ తేదీన సదరు గ్రహశకలం భూమికి అత్యంత దగ్గరగా వస్తుందని, అయితే భూమిని మాత్రం ఢీకొనదని సైంటిస్టులు తెలిపారు. ఆస్టరాయిడ్ భూమికి దగ్గరగా వచ్చినప్పుడు దానికి భూమికి మధ్య ఉన్న దూరం.. భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరానికి 9 రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
అయితే చాలా ఏళ్ల తరువాత ఒక గ్రహ శకలం భూమికి ఇంత దగ్గరగా వస్తుందని, మళ్లీ ఇలా 2063లోనే జరుగుతుందని సైంటిస్టులు తెలిపారు. సదరు ఆస్టరాయిడ్ భూమి వైపు గంటకు 94,208 కిలోమీటర్ల వేగంతో వస్తుందని అన్నారు. భూమికి సమీపంగా వచ్చి అటు నుంచి అటే వెళ్లిపోతుందని తెలిపారు.
కాగా సదరు ఆస్టరాయిడ్‌ను మొదట హవాయిలో జనవరి 2016లో Panoramic Survey Telescope and Rapid Response System (Pan-STARRS) ద్వారా గుర్తించారు. అప్పటి నుంచి దాని గమనాన్ని నాసా పర్యవేక్షిస్తోంది. ఇలాగే మరో 26వేలకు పైగా గ్రహ శకలాలను నాసా సైంటిస్టులు ఎప్పటికప్పుడు టెలిస్కోప్‌ల ద్వారా పరిశీలిస్తున్నారు. అవన్నీ భూమికి సమీపంలో ఉన్నవే. ఎక్కువగా సూర్యుని కక్ష్యలోనే తిరుగుతుంటాయి. అయితే వాటిలో 1000 వరకు గ్రహ శకలాలు ప్రమాదకరమైనవని తెలిపారు.