సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఇండియాలో కొత్త బిజినెస్ మొదలుపెట్టింది. కొత్తగా లెండింగ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించింది. చిరు వ్యాపారులకు రూ.50,00,000 వరకు రుణాలు ఇవ్వనుంది. ప్రముఖ పట్టణాల్లో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.5,00,000 నుంచి రూ.50,00,000 రుణాలు ఇచ్చేందుకు ఇండిఫై లెండింగ్ ప్లాట్‌ఫామ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది ఫేస్‌బుక్. ఈ రుణాలు తీసుకోవడానికి ష్యూరిటీ అవసరం లేదని, వడ్డీ రేటు 17 శాతం నుంచి 20 శాతం మధ్య ఉంటుందని కేవలం 5 రోజుల్లో రుణాలు మంజూరు చేస్తామని ఫేస్‌బుక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ తెలిపారు. మహిళలు ఈ రుణాలు తీసుకుంటే 0.2 శాతం వడ్డీ తక్కువగా ఉంటుందని తెలిపారు.
గత సంవత్సరం 100 మిలియన్ డాలర్ల ఫేస్‌బుక్ బిజినెస్ గ్రాంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, గుర్గావ్, న్యూఢిల్లీలో కరోనా వైరస్‌తో దెబ్బతిన్న చిన్న, మధ్యతరహా వ్యాపారులకు 4 మిలియన్ డాలర్ల ఆర్థిక సహకారాన్ని అందించింది. ఫేస్‌బుక్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మంది వ్యాపారు ఫేస్‌బుక్‌కు చెందిన ఫేస్‌బుక్, ఇన్ స్ట్రాగామ్, వాట్సప్ యాప్స్ ఉపయోగిస్తున్నారు.