మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ సాంకేతిక కారణాలతో నెలల తరబడి అక్కడే చిక్కుకుపోయారు. అయితే ఆమె, ఆమెతో పాటు వెళ్లిన విల్మోర్ రాక మరింత ఆలస్యం కానున్నట్లు తాజాగా నాసా ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లోనే ఉండనున్నట్లు తెలిపింది.
జూన్ 6న బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సుల్‌లో సునీత, విల్‌మోర్ ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. జూన్ 14న వారు భూమికి తిరిగి రావాల్సి ఉండగా వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురవ్వడం.. వాటిని ఇంకా పరిష్కరించకపోవడంతో 2 నెలలుగా వీరిద్దరూ ఐఎస్‌ఎస్‌లోనే ఉండిపోయారు. బోయింగ్ స్టార్‌లైనర్ తిరిగి భూమ్మీద సేఫ్గా ల్యాండ్ అయ్యే అవకాశం లేకపోతే స్పేస్ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్తో వాళ్లను వెనక్కి రప్పించే ప్రయత్నం చేస్తామని నాసా ప్రకటించింది. అయితే ఇది ఫిబ్రవరిలో చేసేందుకు వీలుందని తెలిపింది. ఈ లెక్కన అప్పటి వరకూ సునీత, విల్‌మోర్‌లు ఐఎస్‌ఎస్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.