ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన బిజీబిజీగా సాగుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆయన అమెరికాలోని ఐటీ సర్వీసెస్ కంపెనీల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, డల్లాస్, టెక్సాస్ లో పర్యటన పూర్తి చేసుకున్న రాష్ట్ర బృందం.. తాజాగా కాలిఫోర్నియా చేరుకుంది. ఇప్పటికే పది కంపెనీలతో ఒప్పందాలు చేసుకోగా. వెస్ట్ కోస్ట్ లో పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలకు సిద్ధమయ్యారు. అమెరికా తర్వాత దక్షిణ కొరియాలో సీఎం రేవంత్ బృందం పర్యటించనుంది.
ఇక ఈ పర్యటనలో తాజాగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్, ట్రైజిన్ టెక్నాలజీస్ ముందుకొచ్చాయి. కాగ్నిజెంట్ కొత్త సెంటర్ ఏర్పాటు చేసి 15వేల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపింది. మరోవైపు వీహబ్లో 5 మిలియన్ డాలర్లతో పాటు.. స్టార్టప్లలో 100 మిలియన్ల పెట్టుబడికి వాల్ష్ కార్రా హోల్డింగ్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక హైదరాబాద్ లో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ అండ్ డెలివరీ సెంటర్ నెలకొల్పేందుకు ట్రైజిన్ టెక్నాలజీస్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆరు నెలల్లో సుమారు 500 మందికి పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపింది.