ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్(amazon)కు చెందిన వెబ్‌సైట్ సోమవారం కాసేపు పనిచేయలేదు. కేవలం భారత్ మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్ సైట్లు ఓపెన్ కాలేదు. కొన్ని చోట్ల ఓపెన్ అయినా యూజర్లు ఆర్డర్లు ప్లేస్ చేయలేకపోయారు. కొందరికి ప్రొడక్ట్ డిటెయిల్స్ పేజ్‌లు ఓపెన్ కాలేదు. డౌన్ డిటెక్టర్ అనే సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. భారత కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు అమెజాన్ సైట్ కొంత సేపు పనిచేయలేదు.
ఆ సమయంలో ఆన్‌లైన్‌లో ఉన్నవారిలో దాదాపుగా 65 శాతం మంది యూజర్లు తమకు అమెజాన్ సైట్ యాక్సెస్ కాలేదని తెలిపారు. అలాగే వెబ్‌సైట్‌లో ఉంచిన ప్రొడక్ట్స్‌కు చెందిన పేజీలను ఓపెన్ చేసినా అవి ఓపెన్ కాలేదన్నారు. 23 శాతం మంది అసలు అమెజాన్‌లో లాగిన్ అవలేకపోయారు. మరో 12 శాతం మంది పేమెంట్లు చేయలేకపోయారు.
కాగా అమెజాన్ ఈ విషయంపై స్పందించింది. తమ సైట్ లో సాంకేతిక సమస్యలు వచ్చిన మాట నిజమేనని తెలిపింది. సమస్యను పరిష్కరిస్తున్నామని తెలియజేసింది. కాగా మే నెలలోనూ భారత్‌లో కొన్ని చోట్ల అమెజాన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. అయితే అప్పుడు వెంటనే సమస్యను పరిష్కరించారు. కానీ ఇప్పుడు కూడా అమెజాన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికీ కొందరు ఆ సైట్‌లో సమస్యలను ఎదుర్కొంటున్నామని ట్విట్టర్ వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే అమెజాన్ క్లౌడ్ సర్వర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగానే ఆ సైట్ పనిచేయడం లేదని తెలుస్తోంది.