ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ తన యూజర్లకు ఓ కొత్త ఫీచర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ప్రొఫైల్ లాక్ పేరిట సదరు ఫీచర్ యూజర్లకు లభిస్తోంది. దీని సహాయంతో యూజర్లు ఫేస్‌బుక్‌లో తమ ప్రొఫైల్‌ను లాక్ చేసుకోవచ్చు. దీంతో కేవలం ఫ్రెండ్స్ మాత్రమే ఆ ప్రొఫైల్‌ను చూసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే లాక్ అయిన ప్రొఫైల్ కలిగిన యూజర్లు పెట్టే పోస్టులను కూడా కేవలం వారి ఫ్రెండ్స్ మాత్రమే చూస్తారు. దీంతో అపరిచితులు మన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను, పోస్టులను చూసేందుకు అవకాశం ఉండదు.
కాగా మన దేశంలో ఎక్కువగా ఫేస్‌బుక్‌లో ఉండే మహిళలకు సంబంధించిన ప్రొఫైల్ పిక్‌లను అపరిచిత వ్యక్తులు డౌన్‌లోడ్ చేసుకుంటున్నారని.. దీంతో మహిళలకు ముప్పు పొంచి ఉందనే నేపథ్యంలో ఫేస్‌బుక్ కేవలం మహిళలను ఉద్దేశించి ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే దీన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. యూజర్ తన ప్రొఫైల్‌ను లాక్ చేయగానే దానికి లాక్ అయినట్లు ఒక సింబల్ వస్తుంది. దీంతో ఆ యూజర్ ప్రొఫైల్ లాక్ అయినట్లు భావించాలి. ఈ క్రమంలో ఆ యూజర్‌కు చెందిన పోస్ట్‌లు, ప్రొఫైల్ పిక్‌లను కేవలం ఆ యూజర్ ఫ్రెండ్స్ మాత్రమే చూసేందుకు వీలుంటుంది.
ఇక రానున్న వారం రోజుల్లో ఈ ఫీచర్ దేశవ్యాప్తంగా ఉన్న ఫేస్‌బుక్ యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది. యూజర్లకు ప్రైవసీ, సెక్యూరిటీని కల్పించేందుకే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చామని ఫేస్‌బుక్ ప్రతినిధి ఒకరు తెలిపారు.