ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు ప్రధాన వెబ్‌సైట్లు డౌన్ అయ్యాయి. యూకే కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 11 గంటలకు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దీంతో పలు ప్రధాన సంస్థలకు చెందిన వెబ్‌సైట్లు, సర్వర్ల కార్యకలాపాలు నిలిచిపోయాయి.
ఫైనాన్షియల్ టైమ్స్, గార్డియన్, న్యూ యార్క్ టైమ్స్, సీఎన్ఎన్, కోరా, స్టాక్ ఓవర్ ఫ్లో, గిట్ హబ్, యూకే ప్రభుత్వ వెబ్‌సైట్లు, హులు, హెచ్‌బీవో మ్యాక్స్, పేపాల్, విమియో, షాపిఫై తదితర అనేక సైట్లు డౌన్ అయ్యాయి. అలాగే రెడ్డిట్, ట్విచ్, స్పాటిఫై, పింటరెస్ట్ సైట్ల సేవలు కూడా నిలిచిపోయాయి. అమెజాన్‌కు చెందిన యూకే సైట్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఆయా వెబ్‌సైట్లు, యాప్‌లను ఓపెన్ చేసిన వారికి 503 సర్వీస్ అన్ ఎవలబుల్ అనే ఎర్రర్ మెసేజ్ దర్శనమిచ్చింది.
అయితే ఫాస్ట్‌లీ అనే సైట్ అందించే కంటెంట్ డెలివరీ నెట్‌వర్క్ (సీడీఎన్) సేవల్లో ఏర్పడిన అంతరాయం వల్లే ఆయా సైట్లు డౌన్ అయ్యాయని నిర్దారించారు. దీంతో ఫాస్ట్‌లీ సంస్థ సేవలను పునరుద్ధరించింది. ఈ క్రమంలో అన్ని సైట్లు సరిగ్గానే పనిచేస్తున్నాయని, అంతరాయానికి చింతిస్తున్నామని ఫాస్ట్‌లీ తెలియజేసింది. అయితే ప్రపంచంలో ఏయే దేశాల్లో ఈ సేవలు నిలిచిపోయాయో నిర్దారించలేదు కానీ.. భారత్‌లోనూ దీని ప్రభావం కనిపించింది.