దేశ చరిత్రలోనే భారీ డేటా చోరీ జరిగిందా ?

ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 10 కోట్ల మంది వినియోగదారుల డేటా ఇప్పుడు అమ్మకానికి రెడీగా ఉంది. ఫిన్‌టెక్‌ స్టార్టప్‌ మొబిక్విక్‌కి చెందిన 10 కోట్ల మంది ఖాతాదారుల సమాచారం డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టారు. అయితే ఈ విషయాన్ని మొబిక్విక్‌ ఖండిస్తోంది. తమ ఖాతాదారుల డేటా సురక్షితంగా ఉందని చెబుతోంది. కానీ పరిశోధకులు మాత్రం డేటా చోరీ నిజమేనంటున్నారు.

ఏకంగా పది కోట్ల మంది వినియోగదారుల డేటా ఇప్పుడు అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తుంది. దాదాపు 8 టీబీల డేటా బ్రీచింగ్‌కి గురైందని చెబుతున్నారు. ఇందులో ఖాతాదారుల ఈమెయిల్‌, పేర్లు, ఫోన్‌ నెంబర్‌లు, అడ్రస్‌, పాస్‌వర్డ్‌లు ఉన్నట్లు తెలిపారు. జోర్దాన్‌ డావెన్‌ గ్రూప్‌ హ్యాకర్లు ఈ డేటాను డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టినట్లు వివరించారు. వారు కొనుగోలుదారుల నుంచి బిట్‌కాయిన్స్‌ రూపంలో డబ్బు ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే.. ఈ ఆరోపణలను మొబిక్విక్‌ ఖండించింది.

మొబిక్విక్‌ను 2009లో బిపిన్‌ ప్రీత్‌ సింగ్‌, ఉపాసనా టకూ సంయుక్తంగా స్టార్ట్‌పగా ప్రారంభించారు. నోట్ల రద్దు తర్వాత.. డిజిటల్‌ చెల్లింపులకు డిమాండ్‌ పెరగడంతో దేశీయ యాప్‌ అయిన మొబిక్విక్‌కు ఆదరణ లభించింది. ఆ సంస్థ బీమా, నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్సింగ్‌ రంగంలోనూ అడుగు పెట్టింది. వినియోగదారులు, వ్యాపారులకు రుణాలిస్తోంది.