ఏఐపై ఎలాన్ మస్క్ ఆరోపణలపై మెటా స్ట్రాంగ్ రియాక్షన్

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆరోపిస్తూ ఎలాన్‌ మస్క్‌ సహా పలువురు టెక్‌ రంగ నిపుణులు గత కొద్ది నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. చాట్‌ జీపీటీ వంటి ఏఐ టెక్నాలజీతో భవిష్యత్‌లో మానవాళి మనుగడకే ప్రమాదం తలెత్తవచ్చనే ఆందోళనతో వాటి అభివృద్ధిని నిలిపివేయాల్సిన అవసరం ఉందని మస్క్‌ సహా పలువురు నిపుణులు ‘పాజ్‌ జియాంట్‌ ఏఐ ఎక్స్‌పెరిమెంట్స్‌’ పేరిట ఓ లేఖ రాశారు.

మస్క్ వ్యాఖ్యలను తాజాగా మెటా శాస్త్రవేత్తలు కొట్టిపారేశారు. ఆయన అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని మెటాలో ఏఐపై పరిశోధనలు చేస్తున్న సీనియర్‌ శాస్త్రవేత్త యాన్‌ లీకన్‌ అన్నారు. లీకన్ ఇంకా ఏమన్నారంటే.. ‘‘ఏఐతో మానవ మనుగడకు ముప్పు ఉందనేది కేవలం అపోహ మాత్రమే. మానవులు ఏఐ సిస్టమ్‌ను ఉపయోగించడం ప్రారంభించినప్పుడు అది మరింత తెలివిగా వారితో వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకు అవసరమైన వ్యవస్థను మనమే అభివృద్ధి చేస్తాం. ఒక వ్యవస్థ మరో వ్యవస్థను నాశనం చేయాలంటే అది కొన్ని వనరులను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అలానే అపరిమిత శక్తి అవసరమవుతుంది. ఇలా జరుగుతుందనుకోవడం పూర్తిగా హాస్యాస్పదం.’’ అని లీకున్‌ తెలిపారు.