మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఔట్‌లుక్‌ను మీరు ఎక్కువగా ఉపయోగిస్తున్నారా ? అయితే వెంటనే దానికి సంబంధించిన పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చేయండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది మైక్రోసాఫ్ట్ యూజర్ల అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ సంస్థ వెల్లడించింది. మొత్తం 60వేల మందికి పైగా యూజర్లకు చెందిన మైక్రోసాఫ్ట్ అకౌంట్లు హ్యాక్ అయినట్లు నిర్దారించారు.
చైనాకు చెందిన హాఫ్‌నియం అనే హ్యాకింగ్ గ్రూప్ ఈ పనికి పాల్పడినట్లు వెల్లడైంది. ఈ క్రమంలోనే వోలెక్సిటీ అనే సైబర్ సెక్యూరిటీ కంపెనీ ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌తో కలిసి ఏయే డేటా హ్యాకైంది, ఎవరు చేశారు ? అన్న వివరాలను తెలుసుకునే పనిలో పడ్డారు. వీరితోపాటు వైట్ హౌజ్ అధికారులు కూడా ఈ విషయాన్ని విచారిస్తున్నామని తెలిపారు.
కాగా సదరు హ్యాకర్లు హ్యాక్ చేసిన అకౌంట్లలో ఎక్కువగా చిన్న, మధ్య తరహా కంపెనీలకు చెందిన అకౌంట్లే ఉన్నాయని, అలాగే కొన్ని బ్యాంకులు, విద్యుత్ సంస్థలు, సీనియర్ సిటిజెన్‌లకు చెందిన అకౌంట్లు, ఐస్ క్రీమ్ కంపెనీలకు చెందిన మైక్రోసాఫ్ట్ అకౌంట్లు హ్యాక్ అయినట్లు నిర్దారించారు. ఈ క్రమంలోనే హ్యాక్ అయిన అకౌంట్ల నుంచి ఏ డేటాను చోరీ చేశారు ? అనే వివరాలను సేకరిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాల్లో తెలియాల్సి ఉంది.