చుట్టుపక్కల వినిపించే మాటలు ప్రవర్తనని మార్చేస్తాయని చెప్పే ఏనుగు కథ..

-

ఒకానొక ఊరిలో ఏనుగు ఉండేది. ఆ ఏనుగు అంటే రాజుకి చాలా ఇష్టం. అందుకని దాన్ని ఊర్లోనే ఉంచుతూ పెంచుతున్నాడు. దానికోసం మావటివాడిని కూడా ఏర్పాటు చేసాడు. రాజభవనానికి కొద్ది దూరంలో ఒక పెద్ద పాకలో ఏనుగు ఉంటుంది. ఒకరోజు రాత్రి ఆ పాక వెనకాలకి వచ్చిన దొంగలు, వారి వారి దొంగతనాల గురించి మాట్లాడుకుంటున్నారు. అడ్డం వచ్చిన వారిని ఎలా భయపెట్టాలా అని చెప్పుకుంటూ, అశ్లీల సంభాషణలతో మాట్లాడుకుంటున్నారు. ఈ మాటలు ఏనుగు విన్నది.

ఇలా కొన్ని రోజులు సాగిపోయింది. ఒకరోజు మావటివాడు ఏనుగును చూడడానికి వచ్చాడు. అప్పుడు ఆ ఏనుగు మావటివాడిని తొండంతో పైకి లేపి కింద పడేసి కాళ్ళతో తొక్కేసింది. అంతే మావటివాడు చనిపోయాడు. ఈ వార్త ఊరంతా వ్యాపించింది. రాజుగారు ఇష్టంగా చూసుకున్న ఏనుగు ఇలా చేసిందని ఆశ్చర్యపోయిన జనాలు, ఏనుగుని ఊర్లో నుండి పంపేయాలని రాజుగారిని కోరారు. అపుడు ఏనుగు ఇలా మారడానికి కారణమేంటా అని ఆలోచిస్తూ, ఆ పనిని మంత్రికి అప్పగించాడు.

మంత్రి ఏనుగు ఉన్న పాక వద్దకి వెళ్ళాడు. మంచిమాటలతో సముదాయిస్తూ మెల్లగా ఏనుగు దగ్గరగా వెళ్ళాడు. ఆ మాటలు విన్న ఏనుగు చెవులు బాగా రిక్కించింది. విషయం అర్థమైన మంత్రి, అక్కడున్న వారిని పిలిచి, ఇక్కడేమైనా గొడవ లాంటిది జరిగిందా అని అడిగారు. దానికి వారు, జరిగిందంతా చెప్పారు. ఈ విషయాన్ని రాజుకి చెప్పిన మంత్రి పరిష్కారాన్ని కూడా చెప్పాడు. దయా స్వభావం గల వారిని తీసుకొచ్చి, ఏనుగుతో మాటలు మాట్లాడిస్తే దాని ప్రవర్తనలో మార్పు వస్తుందని చెప్పాడు. అనుకున్నట్టుగానే చేసారు. అప్పుడు ఆ ఏనుగులో మార్పు వచ్చింది.

మీ జీవితంలో మీ చుట్టుపక్కల ఉన్న వినిపించే మాటలు మీ ప్రవర్తనలని మారుస్తాయి. మీ ప్రవర్తన మీద ప్రభావం పడుతుందన్నప్పుడు మీరు అక్కడి నుండి తప్పుకోవాలి. డేర్ టు డూ మోటివేషన్ ఆధారంగా.

Read more RELATED
Recommended to you

Latest news