ఇలా చేయకపోతే మీ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌ ఫ్రీజ్‌ అవుతుంది తెలుసా..?

-

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో సుకన్య సమృద్ధి యోజన చాలా పాపులర్ అయింది. అమ్మాయిల భవిష్యత్తు కోసం డబ్బు పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రులకు ఈ స్కీమ్ ఓ వరంలా మారింది. ప్రతీ నెలా ఈ పథకంలో పొదుపు చేస్తే దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ వస్తాయి. ఈ స్కీమ్‌లో వడ్డీ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ పథకంలో చేరేవారి సంఖ్య ఎక్కువైంది.

సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌లో ఉన్నవారు తప్పనిసరిగా తమ ఆధార్ నెంబర్ , పాన్ నెంబర్ లింక్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రూల్ ఇది. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌కు పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే ఆ అకౌంట్ ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సుకన్య సమృద్ధి యోజన పథకం మాత్రమే కాదు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లాంటి చిన్నమొత్తాల పొదుపు పథకాలకు ఈ రూల్ వర్తిస్తుంది.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2023 మార్చి 31న ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం.. చిన్న మొత్తాల్లో పొదుపు పథకాలకు సంబంధించి కేవైసీ నిబంధనల్లో మార్పులు జరిగాయి. గతంలో ఈ పొదుపు పథకాల్లో చేరడానికి ఆధార్ నెంబర్ తప్పనిసరిగా ఉండేది కాదు. కొత్త రూల్స్ ప్రకారం.. ఈ పొదుపు పథకాల్లో చేరడానికి ఆధార్ నెంబర్ లేదా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నెంబర్ చేయడం తప్పనిసరి.

చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఉన్నవారంతా 2023 సెప్టెంబర్ 30 లోగా తమ ఆధార్ నెంబర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పొదుపు పథకంలో చేరినప్పుడు ఆధార్ నెంబర్ ఇచ్చినవారు మళ్లీ తమ ఆధార్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వం విధించిన లిమిట్‌ను మించి డబ్బులు దాచుకోవాలంటే పాన్ నెంబర్ కూడా తప్పనిసరి చేసింది.

ఈ సందర్భాల్లో పాన్‌ తప్పనిసరి..

ఈ పొదుపు పథకాల్లో బ్యాలెన్స్ రూ.50 వేలు దాటినా, ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక అకౌంట్‌లో రూ.1 లక్షకు మించి డబ్బులు జమ చేసినా లేదా ఒక నెలలో ఒక అకౌంట్ నుంచి రూ.10 వేలకు మించి విత్‌డ్రా లేదా బదిలీ చేసినా పాన్ నెంబర్ సబ్మిట్ చేయాలి. పాన్ నెంబర్ లేనివాళ్లు తప్పనిసరిగా పాన్ కార్డ్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదా ఫామ్ 60 సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పాన్ నెంబర్ సబ్మిట్ చేయకపోతే అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news