రుణం తీసుకున్నా.. మరో రుణమా అదేలా..?

నేటి కాలంలో రుణం తీసుకోవడం చాలా సులభమైంది. సంబంధిత పత్రాలు సమర్పిస్తే చాలు.. వాహనం, గృహ, వ్యాపారాల కోసం వివిధ ఆర్థిక సంస్థలు రుణాలు మంజూరు చేస్తాయి. ఇది వరకే రుణం సుకున్నావరైతే మళ్లీ రుణం పొందేందుకు అవకాశం ఉండదని అందరికీ తెలుసు. కానీ.. రుణం ఉండగా మరో రుణం పొందొచ్చు. ఇదివరకే తీసుకున్న లోన్‌పైనే టాప్‌–ఆప్‌లోన్‌ను పొందవచ్చు.

ఏమిటి టాప్‌–అప్‌..?

ముందుగానే తీసుకున్న రుణంపైనే ఎక్స్‌ట్రా రుణం పొందడమే టాప్‌అప్‌ రుణం. ఇది వరకే తీసుకున్న రుణం తీర్చకముందే మళ్లీ తీసుకోవడం సాధ్యమా..? అనే సందేహాలు తలెత్తుతాయి. ఇందులో మన అవసరాన్నీ బట్టి, తప్పని పరిస్థితుల్లో మనకు రుణం కావాలనుకుంటే సరైన కారణాలు చూపి టాప్‌అప్‌లోన్‌ పొందవచ్చు. వివిధ రకాల లోన్లలతో పోల్చితే వడ్డీ కూడా చాలా తక్కువే.
టాప్‌అప్‌లోన్‌ కావాలనుకుంటే సరైన వివరాలతో కూడిన డాక్యుమెంట్లు సమర్పిస్తే ఇంతకు ముందు తీసుకున్న రుణానికి సమానంగా లేదా అంతకన్న తక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. ఈ లోన్‌ను సాధారణంగా వ్యక్తిగత, గృహాలపైనే మంజూరు చేస్తారు.

ఇచ్చే విధానం..

టాప్‌అప్‌లోన్‌ సౌకర్యం అన్ని బ్యాంకుల్లో ఉంటుంది. వీటిని ఎక్కువగా గృహ నిర్మాణ కోసమే తీసుకుంటారు. రుణం చెల్లించడం ప్రారంభమై 6 నుంచి 12 నెలలకు టాప్‌అప్‌లోన్‌ ఇస్తారు. ఇంటికోసం ఇంతకు ముందే చాలా సార్లు తీసుకున్నాం కదా.. మళ్లీ ఇంటి పేరు చెబితే ఇస్తారో.. లేదో అనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే ఇక్కడ ఓ జిమ్మక్కు ఉంటుంది. మొత్తం తీసుకున్న రుణం నుంచి తగ్గిన రుణాన్ని తీసివేస్తే వచ్చే ఆ మొత్తానికి టాప్‌అప్‌లోన్‌ మంజూరు చేస్తారు.

చెల్లించే సమయం..

టాప్‌అప్‌లోన్‌ తీసుకున్న తర్వాత మళ్లీ ఎప్పుడు చెల్లించాలనేది బ్యాంకు నిర్ణయిస్తుంది. చెల్లింపు గడువు 20 ఏళ్లు, లేదంటే మీ ఇళ్లు నిర్మాణం పూర్తయ్యే వారకు ఉండొచ్చు. లోన్‌ తీసుకునే వారి తలసరి ఆదాయం, వయస్సు, ఆస్తి వివరాలను పరిశీలించి రుణం అందజేస్తుంది.

ఇవి గుర్తించుకోవాలి..

టాప్‌అప్‌లోన్‌కు దరఖాస్తు చేసుకునేటప్పుడు గతంలోని మీ రుణ చరిత్ర పాజిటివ్‌ గా ఉండేలా చూసుకోవాలి. గతంలో మీరు తీసుకున్న రుణాల చెల్లింపులు, రిమార్కులను తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మీకు లోన్‌ అందజేస్తారు. సరైన సమయానికి తీర్చారా.. అనే విషయం కూడా పరిగణలోకి తీసుకుంటారు.