అన్నాతమ్ముళ్లకే కాదు.. భర్తకు కూడా రాఖీ కట్టొచ్చట…!!

-

అన్నాచెల్లెల అనుబంధం.. ఇది జన్మజన్మలా సంబంధం.. అంటూ రాఖీ పౌర్ణమి రోజు సోదరసోదరీమణులు తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు. సోదరి.. తన సోదరుడికి రాఖీ కట్టి.. తనకు రక్షగా ఉండాలని కోరుకుంటుంది. అయితే.. రక్షా బంధన్‌ను కేవలం అన్నాచెల్లెళ్లు మాత్రమే కాదట.. భార్యాభర్తలు కూడా జరుపుకోవచ్చట. వినడానికి కొంచెం కొత్తగా, వింతగా ఉన్నా ఇది నిజం అంటున్నారు. దానికి ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు. మరి.. అవేంటో తెలుసుకుందామా..

పురాణాల్లో దేవుళ్లు, రాక్షసుల మధ్య ఎప్పుడూ యుద్ధం కొనసాగుతూనే ఉండేది. ఓసారి దేవతల రాజు ఇంద్రుడు ఓ యుద్ధంలో ఓడిపోతాడు. దీంతో యుద్ధంలో ఓడిపోయానని డీలా పడిపోతాడు ఇంద్రుడు. తన శక్తిని కోల్పోయి నిర్వీర్యుడైపోతాడు. ఇక.. రాక్షసులతో యుద్ధంలో గెలవలేనని తలచిన ఇంద్రుడు దేవతలందరినీ తీసుకొని అమరావతిలో తలదాచుకుంటాడు.

ఇంద్రుడి నిస్సహాయతను గమనించిన ఆయన భార్య శచీ దేవి.. తన భర్తకు తిరిగి ఎలాగైనా శక్తినివ్వాలని ఆలోచిస్తుంటుంది. ఇంతలో రాక్షసరాజు అమరావతిని కూడా ఆక్రమించుకోబోతున్నాడని.. అమరావతి మీదికి యుద్ధానికి దండెత్తడానికి వస్తున్నాడని సమాచారం వస్తుంది. దీంతో తన భర్త ఇంద్రుడిని సమరోత్సాహం చేయాలని కోరుతుంది శచీ దేవీ. సరిగ్గా ఆరోజు శ్రావణ పూర్ణిమ అవడంతో.. పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజిస్తుంది. అనంతరం వాళ్ల దగ్గర పూజించబడిన రక్షను ఇంద్రుడి చేతికి కడుతుంది శచీ దేవి. వెంటనే దేవతలంతా వచ్చి తమ తోరణాలను దేవేంద్రుడికి కట్టి యుద్ధంలో అండగా నిలుస్తారు. అప్పుడు తన శక్తిని తిరిగి తెచ్చుకున్న ఇంద్రుడు రాక్షసరాజును ఓడించి తిరిగి తన మూడులోకాలను గెలుచుకుంటాడు. అప్పుడు శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనోత్సవ తోరణం.. ఆ తర్వాతి కాలంలో రాఖీ పౌర్ణమిగా జరుపుకోవడం ఆచారంగా వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి.. ఈ పండుగను అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లే కాదు.. భార్యాభర్తలు కూడా జరుపుకోవచ్చని పండితులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news