లోన్ తీసుకునేముందు బ్యాంకులు మనల్ని ఎన్నో రకాల డాక్యుమెంట్స్ అడుగుతాయి. బ్లాంక్ చెక్కు మీద సైన్స్, బాండులు లాంటివి చాలా ఇస్తాయి. లోన్ పూర్తిగా కట్టిన తర్వాత నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకోవడం ఎంత ముఖ్యమో.. మీరు సమర్పించిన డాక్యుమెంట్స్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. బాధ్యతాయుత రుణ వితరణను ప్రోత్సహించే దిశగా ‘భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) బ్యాంకులు, బ్యాంకింగేతర కంపెనీల (NDFCs) వంటి నియంత్రిత సంస్థలు రుణ చెల్లింపులు పూర్తయిన 30 రోజుల్లోగా స్థిర, చరాస్తుల సంబంధించిన పత్రాలను రుణగ్రహీతలకు తిరిగిచ్చేయాలని ఆదేశించింది. ఈ విషయంలో 2003 నుంచే స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ.. కొన్ని సంస్థలు నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నాయని ఆర్‌బీఐ (RBI) గుర్తించింది. ఇవి 2023 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.
కొన్ని సంస్థలు నిబంధనలను ఉల్లంఘించడం వల్ల కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని ఆర్‌బీఐ ఉత్తర్వుల్లో తెలిపింది. దీనివల్ల వివాదాలు తలెత్తుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో రుణదాతల్లో బాధ్యతాయుత రుణ జారీలను ప్రోత్సహించడం కోసమే ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు వివరించింది. తాజా ఆదేశాల ప్రకారం రుణ గ్రహీతలు తమ స్థిర లేదా చరాస్తులకు సంబంధించిన పత్రాలను రుణం పూర్తిగా చెల్లించిన వెంటనే సంబంధిత బ్యాంకు/సంస్థలు లేదా వాటికి సంబంధించిన కార్యాలయాల నుంచి తీసుకోవాలి. ఒకవేళ రుణగ్రహీతలకు అకాల మరణం సంభవిస్తే పాటించాల్సిన నియమ నిబంధనలను కూడా సంస్థలు పక్కాగా రూపొందించాలని ఆర్‌బీఐ ఆదేశించింది. ఈ విధానాలన్నింటినీ సంస్థలు తమ వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని తెలిపింది.
ఒకవేళ రుణం పూర్తిగా తిరిగి చెల్లించిన 30 రోజుల్లోగా పత్రాలను ఇవ్వలేకపోతే అందుకుగల కారణాలను తెలియజేస్తూ బ్యాంకులు కస్టమర్లకు సమాచారం అందజేయాలి. సరైన కారణాలు లేకుండా బ్యాంకులు/సంస్థల నిర్లక్ష్యం వల్లే జాప్యం జరిగితే రుణ గ్రహీతలకు రోజుకు రూ.5,000 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆర్‌బీఐ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. ఒకవేళ పత్రాలు కనపడకుండా పోతే వాటిని తిరిగి పొందేలా రుణగ్రహీతలకు సాయం చేయాలి. అలాగే అందుకు అయ్యే ఖర్చును మొత్తం బ్యాంకులు/సంస్థలే భరించాలి. దీనితో పాటు రోజుకు రూ.5,000 పరిహారం కూడా అందజేయాలి. లోన్ తీసుకున్న వాళ్లు ఈవిషయాలు తప్పక తెలుసుకోవాలి.