సాధారణంగా మనం ఫోన్లను కొన్నప్పుడే ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కానీ కొన్ని కంపెనీలు ఆఫ్‌లైన్‌లో ఫోన్‌ను వెరిఫై చేసి కూడా పాత ఫోన్లకు కూడా ఇన్సూరెన్సును అందజేస్తున్నాయి.
మార్కెట్‌లో ఇప్పుడు మనకు అనేక రకాల కంపెనీలకు చెందిన భిన్నమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో నిత్యం ఒక్కో కంపెనీ కొత్త కొత్త ఫోన్లను కూడా విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ఒకప్పుటి కన్నా ఇప్పుడు ఫోన్లను కొనే వారి సంఖ్య బాగా పెరిగింది. దీనికి తోడు ఈఎంఐ కూడా అందుబాటులో ఉండడంతో ముందు, వెనుకా ఆలోచించకుండా చాలా ఖరీదైన ఫోన్లను కొంటున్నారు. అయితే అలాంటి ఫోన్లను కొనడం ఒకెత్తు అయితే.. వాటిని డ్యామేజ్ కాకుండా చూసుకోవడం మరొక ఎత్తు.. ఈ క్రమంలోనే కొన్ని సందర్భాల్లో అనుకోకుండా మన ఫోన్లు పోవడమో, ఎవరైనా దొంగతనం చేయడమో లేదా డ్యామేజ్ కావడమో జరుగుతూ ఉంటుంది. అయితే చాలా డబ్బు పెట్టి కొన్న ఫోన్ అలా డ్యామేజ్ అయినా, పోయినా మనస్సు చివుక్కుమంటుంది. మళ్లీ కొత్త ఫోన్ కొనలేం. కనుక మనం కొన్న ఫోన్‌కు కచ్చితంగా ఇన్సూరెన్సు ఉండి తీరాలి. ఈ క్రమంలోనే ఫోన్లకు అందుబాటులో ఉన్న ఇన్సూరెన్సుల గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మనం ఫోన్లను కొన్నప్పుడే ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కానీ కొన్ని కంపెనీలు ఆఫ్‌లైన్‌లో ఫోన్‌ను వెరిఫై చేసి కూడా పాత ఫోన్లకు కూడా ఇన్సూరెన్సును అందజేస్తున్నాయి. ఇక ఇన్సూరెన్స్ ప్రీమియంను ఒక సంవత్సరానికి వసూలు చేస్తారు. అది కూడా ఫోన్ ధరలో 10 శాతం వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అదే పాత ఫోన్ అయితే ఆ ఫోన్‌కు సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో ప్రస్తుతం ఎంత ధర ఉందో లెక్కకట్టి ఆ మేర ఇన్సూరెన్స్ చేస్తారు. ఇక ఫోన్లకు రెండు రకాల ఇన్సూరెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి డ్యామేజ్ ఇన్సూరెన్స్. రెండోది ఎక్స్‌టెండెడ్ వారంటీ.
డ్యామేజ్ ఇన్సూరెన్స్ వల్ల ఫోన్ కిందపడ్డా, నీళ్ల పడినా, పగిలిపోయినా దాని పార్ట్‌లు డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసుకుని ఆ మేర దాన్ని ఉపయోగించుకోవచ్చు. మనకు కొత్తపార్టుల చార్జిలు తప్పుతాయి. వాటిని ఇన్సూరెన్స ఇచ్చే కంపెనీయే చూసుకుంటుంది. అయితే కొన్ని కంపెనీలు డ్యామేజ్ అయ్యాక వేసే కొత్త పార్టుకు పూర్తిగా ఇన్సూరెన్స్‌ను ఇస్తుంటే… మరికొన్ని మాత్రం కొత్త పార్ట్‌లు వేయించుకునే సందర్భంలో కేవలం కొంత వరకు సొమ్మును మాత్రమే ఇన్సూరెన్స్‌ను ఇస్తున్నాయి. కనుక ఎవరైనా సరే ఫోన్‌కు ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో ఈ విషయాన్ని ఒకసారి అడిగి తెలుసుకోవాలి. లేదా ఇన్సూరెన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్షుణ్ణంగా చదువుకోవాలి. ఇక ఎక్స్‌టెండెడ్ వారంటీ అంటే.. మన ఫోన్ ఫిజికల్, లిక్విడ్ డ్యామేజ్ తప్ప సాఫ్ట్‌వేర్ లోపం, హార్డ్‌వేర్ లోపం వల్ల చెడిపోతే దాన్ని ఉచితంగా కంపెనీయే రిపేర్ చేసి ఇచ్చేలా మనకు ఇన్సూరెన్స్ ఇచ్చే కంపెనీ మధ్యవర్తిగా ఉంటుంది. ఈ సందర్భంలోనూ ఒక్కోసారి మనకు పూర్తిగా ఇన్సూరెన్స్ కవర్ కావచ్చు, కాకపోవచ్చు. దీనికి కూడా ఇన్సూరెన్స్ నియమ నిబంధనలను చదువుకుంటే మంచిది.
ఫోన్లు డ్యామేజ్ అయినా, దొంగతనానికి గురైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ మీ అజాగ్రత్త వల్ల పోయిందని కంపెనీలకు అనిపిస్తే వారు మీకు ఇన్సూరెన్స్ ఇవ్వకపోవచ్చు. అందుకని మీ ఫోన్ పోయిన సందర్భంలో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఇక ఫోన్ దొంగతనానికి గురైన పక్షంలో ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవాలి. దాంతోపాటు ఆధార్, పాన్ కార్డులను జిరాక్స్ తీసి క్లెయిమ్ ఫాం నింపి ఇన్సూరెన్స్ ఆఫీస్‌లో సమర్పించాలి. ఆ తరువాత 15 రోజుల్లోగా వారు విచారించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ను ఆమోదిస్తారు. ఆ మేరకు డ్యామేజ్ అయితే వారే స్వయంగా చేయించి ఇవ్వడమో లేదా పార్టులకు అయ్యే ఖర్చును క్లెయిమ్ ద్వారా అందించడమో చేస్తారు. దీనికి గాను పార్ట్‌లకు అయ్యే ఖర్చు కొటేషన్‌ను క్లెయిమ్‌దారులు ఇన్సూరెన్స్ కంపెనీకి ఇవ్వాలి. వారు ఆ కొటేషన్‌కు అనుగుణంగా స్పేర్ పార్టులకయ్యే మొత్తాన్ని వినియోగదారులకు లేదా సర్వీస్ చేసే వారికి ఇస్తారు. ఇక ఫోన్ దొంగతనానికి గురైతే దాని విలువకు సమానమైన మొత్తాన్ని క్లెయిమ్‌దారులకు అందజేస్తారు.
ఫోన్ దొంగతనానికి గురైన పక్షంలో ఇన్సూరెన్స్‌కు క్లెయిమ్ చేశాక ఆ మొత్తం వచ్చేందుకు కనీసం 7 వర్కింగ్ డేస్ సమయం పడుతుంది. గరిష్టంగా 15 రోజుల్లోగా క్లెయిమ్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇక ఈ ప్రక్రియకు అయ్యే ఖర్చులను వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. అయితే వినియోగదారులు ఏ కంపెనీకి చెందిన ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే.. ఒకసారి మొత్తం రూల్స్‌ను చదువుకోవడం మంచిది. ముఖ్యంగా ఏయే సందర్భాల్లో క్లెయిమ్ వస్తుందనే వివరాలను కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కనుక స్మార్ట్‌ఫోన్లకు ఇన్సూరెన్స్ తీసుకునే వారు ఈ విషయాలపై కచ్చితంగా అవగాహన కలిగి ఉండాల్సిందే..!