ఆర్థిక సమస్యలతో చాలా మంది వ్యక్తిగత రుణాలను తీసుకుంటుంటారు. ఇక కొందరు ఇంటి రుణం తీసుకుంటే, కొందరు కార్ల వంటి వాహనాలను కొనేందుకు లోన్లు తీసుకుంటుంటారు. అయితే కొందరు మాత్రం అవసరం ఉన్నా, లేకపోయినా లోన్లను తీసుకుంటారు. పెద్ద మొత్తంలో రుణం తీసుకుని దాన్ని చెల్లించడంలో విఫలం అవుతుంటారు. కానీ నిజానికి ఏ లోన్ తీసుకునే ముందు అయినా సరే కింద తెలిపిన 5 గోల్డెన్ రూల్స్ ను ప్రతి ఒక్కరూ పాటించాలి. దీంతో రుణ బాధ, ఈఎంఐ బాధ లేకుండా ఉంటుంది. మరి ఆ రూల్స్ ఏమిటంటే..
1. సాధారణంగా కొందరు తమకు నెల నెలా వచ్చే జీతం కన్నా అధిక మొత్తంలో ఈఎంఐలతో రుణాలను తీసుకుంటారు. ఇది మంచిది కాదు. మొత్తం వేతనంలో సగం వరకు ఈఎంఐలు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. అది మించకూడదు. అంటే మీకు రూ.50వేలు నెలకు వస్తాయనుకుంటే.. అందులో సగం.. అంటే రూ.25వేల వరకు ఈఎంఐలు చెల్లించేలా రుణాలను తీసుకోవచ్చు. అంతకు మించితే ఈఎంఐలను చెల్లించడం కష్టతరమవుతుంది.
2. ఈఎంఐ తక్కువ అవుతుంది కదా అని చెప్పి కొందరు లోన్లను సుదీర్ఘకాలంలో చెల్లించేలా టెన్యూర్ తీసుకుంటారు. కానీ లోన్ చెల్లించే వ్యవధి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఈఎంఐ ఎక్కువ అయినా ఫర్లేదు. కానీ లోన్‌ను వీలైనంత తక్కువ కాల వ్యవధిలో చెల్లించేలా టెన్యూర్‌ను ఫిక్స్ చేసుకోవాలి.
3. క్రెడిట్ కార్డుల బిల్లులు అయినా సరే, ఈఎంఐలు అయినా సరే నెల నెలా కచ్చితంగా చెల్లింపులు చేయాలి. లేదంటే భారీ మొత్తంలో జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. ఇది అదనపు భారం అవుతుంది.
4. కొందరు అవసరం లేకున్నా డబ్బును అప్పుగా తీసుకుని దాన్ని ఇతర మార్గాల్లో పెట్టుబడిలా పెట్టాలని అనుకుంటారు. అయితే వ్యాపారం కోసం అయితే ఫర్వాలేదు. కానీ షేర్ మార్కెట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి వాటిలో డబ్బును పెట్టాలని అనుకుంటారు. నిజానికి వాటిల్లో వచ్చే వడ్డీ లేదా ఆదాయం వారు అప్పు కోసం చెల్లించే వడ్డీ కన్నా తక్కువగానే ఉంటుంది. అందువల్ల ఆ విధంగా పెట్టుబడి పెట్టేటట్లయితే డబ్బును అప్పుగా తీసుకోకూడదు. ఏదైనా వ్యాపారం చేసినా, ఆస్తులు కొనదలుచుకున్నా డబ్బును అప్పుగా తీసుకోవచ్చు.
5. కార్ లేదా ఇంటి రుణం తీసుకున్నప్పుడు వినియోగదారుడికి ఏదైనా జరిగి మరణిస్తే ఆ రుణం పెండింగ్‌లో పడుతుంది. దీంతో రుణం ఇచ్చే సంస్థలు వాటిని జప్తు చేసి తీసుకుంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దీంతో అలాంటి సందర్భాల్లో ఇన్సూరెన్స్ కవరేజీ లభిస్తుంది. ఇన్సూరెన్స్ ద్వారా లభించే మొత్తంతో రుణం మొత్తాన్ని తీర్చేయవచ్చు. కారు లేదా ఇంటిని వినియోగదారుడికి చెందిన వారు వాడుకుంటారు. వారికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది.