భారత ప్రభుత్వం నోట్ల రద్దు తర్వాత దేశంలో… డిజిటల్ లావాదేవీల సంఖ్య పెరిగింది. ప్రతీ చిన్న విషయానికి డిజిటల్ లావాదేవీల మీదే ఆధారపడుతున్నారు. ఇక ఇందుకు పలు ఆఫర్లు కూడా వివిధ యాప్ ల ద్వారా అందుబాటులోకి రావడంతో జనం వాటికి మొగ్గు చూపుతున్నారు. పెట్రోల్, హోటల్స్, చిన్న చిన్న కొనుగోళ్ళ విషయంలో భారతీయులు వాటి వైపే మొగ్గు చూపిస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో కూడా వీటికి రివార్డ్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉన్న నేపధ్యంలో వాటిపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసీ తన వినియోగదారుల కోసం ఒక ఆఫర్ ఇచ్చింది. ఇక నుంచి క్రెడిట్ కార్డుతో చేసే లావాదేవీలపై చార్జీలు వేసేది లేదని ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. పాలసీ రినీవల్, ప్రీమియం, రుణం, వడ్డీ చెల్లింపులను క్రెడిట్ కార్డుతో చేస్తే ఏ విధమైన చార్జీలు ఉండవని సంస్థ పేర్కొంది. అలాగే ఇక నుంచి ఆన్‌లైన్‌లో, పాయింట్ ఆఫ సేల్స్ యంత్రాల వద్ద లావాదేవీలు నిర్వహించే పాలసీదారులకు అదనపు ఛార్జీలు ఉండవు అంటూ కీలక ప్రకటన చేసింది.
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి గాను ఈ నిర్ణయం సంస్థ తీసుకుంది. ఇక ఇదిలా ఉంటే… జీవిత బీమా ప్రయోజనాలను విస్తరించే ఉద్దేశంలో భాగంగా గతంలో ఆపేసిన లేదా అవకాశం లేక వదిలేసిన పాలసీలను కూడా తిరిగి కొనసాగించవచ్చు. జనవరి1, 2014 తరువాత కొనుగోలు చేసిన పాలసీలకు కూడా ఎక్కువ పునరుద్ధరణ కాలం ఇవ్వాలని ఎల్ఐసీ ఐఆర్‌డీఏఐను సంప్రదించి కోరింది. దీనితో అప్పటి నుంచి కొనుగోలు చేసిన నాన్ లింక్డ్ పాలసీలను ప్రీమియం చెల్లించని మొదటి వాయిదా నుంచి అయిదేళ్ళ లోపు, యూనిట్ లింక్డ్ పాలసీలను మూడేళ్ళ లోపు రెన్యువల్ చేసుకునే సదుపాయాన్ని ఇటీవల సంస్థ కల్పించింది.