వేసవిలో చాలా మంది వెళ్లాలనుకునే చల్లని ప్రదేశాల్లో కాశ్మీర్ కూడా ఒకటి. ఇక్కడ మంచు పర్వతాలను, ప్రకృతి రమణీయతను చూసేందుకు రెండు కళ్లు చాలవు. పర్యాటకులకు ఈ ప్రాంతం మధురానుభూతులను పంచుతుంది.
వేసవి కాలం.. మే నెల.. పర్యాటకులకు అనువుగా ఉండే మాసం.. ఎందుకంటే సాధారణంగా ఈ నెల వచ్చే వరకు విద్యార్థులకు పరీక్షలు అయిపోతాయి. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్లాలని చూస్తుంటారు. అందుకనే చాలా మంది ఈ నెలలో టూర్లు వేస్తుంటారు. అయితే మండుతున్న ఎండల దృష్ట్యా చాలా మంది చల్లని ప్రాంతాలకే పర్యటనలకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే మన దేశంలో ఉన్న అత్యంత చల్లని ప్రాంతాల వివరాలను మీకందిస్తున్నాం.. వేసవిలో ఈ ప్రాంతాల్లో ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు. చల్లగా విహారం చేయవచ్చు. మరింకెందుకాలస్యం.. ఆ ప్రాంతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. కూర్గ్
కోయంబత్తూర్‌కు సుమారుగా 100 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంటుంది. బెంగళూరు లేదా కొచ్చి నుంచి కూడా కూర్గ్‌కు వెళ్లవచ్చు. ఇక్కడ సముద్ర మట్టానికి 1500 మీటర్ల ఎత్తులో ఉండే పచ్చని పర్వత ప్రాంతాల్లో విహరిస్తుంటే.. మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కచ్చితంగా మరిచిపోతాం. అంత అద్భుతమైన ప్రకృతి రమణీయత ఇక్కడ ఉంటుంది. అలాగే ఇక్కడ ఉష్ణోగ్రతలు ఎప్పుడూ 28 డిగ్రీల కన్నా తక్కువగానే ఉంటాయి. అందువల్ల వేసవిలో ఈ ప్రాంతంలో విహరించేందుకు అనువుగా ఉంటుంది.
2. డార్జిలింగ్
బాగ్‌డోగ్రా ఎయిర్‌పోర్ట్ నుంచి డార్జిలింగ్ సుమారుగా 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడి మే నెలలో అద్భుతమైన వాతావరణం ఉంటుంది. టీ లవర్లకు అద్భుతమైన, అనేక రకాల టీ వెరైటీలు ఇక్కడ లభిస్తాయి. అలాగే పచ్చని పర్వత ప్రాంతాల్లోనూ విహరించవచ్చు.
3. కాశ్మీర్
వేసవిలో చాలా మంది వెళ్లాలనుకునే చల్లని ప్రదేశాల్లో కాశ్మీర్ కూడా ఒకటి. ఇక్కడ మంచు పర్వతాలను, ప్రకృతి రమణీయతను చూసేందుకు రెండు కళ్లు చాలవు. పర్యాటకులకు ఈ ప్రాంతం మధురానుభూతులను పంచుతుంది.
4. కొడైకెనాల్
ఈ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారుగా 2100 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కొడైకెనాల్ అంటే ది గిఫ్ట్ ఆఫ్ ది ఫారెస్ట్ అని పిలుస్తారు. పేరుకు తగినట్లుగానే ఇక్కడ పచ్చని అరణ్యాలు, పచ్చిక బయళ్లు పర్యాటకులకు స్వాగతం పలుకుతుంటాయి. చల్లని గాలుల నడుమ వేసవిలో ఇక్కడ సేదదీరుతుంటే వచ్చే మజాయే వేరు.
5. మనాలి
షిమ్లా నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంటుంది. వేసవిలో ఈ ప్రాంతానికి చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. సముద్ర మట్టానికి ఈ ప్రాంతం 2వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది. చలికాలంలో శరీరం గడ్డ కట్టుకుపోయే చలి ఇక్కడ ఉంటుంది. కానీ వేసవిలో చల్లదనాన్ని ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు. అలాగే పర్వతాలపై విహరించవచ్చు.