నోటా అంటే ఏంటి.. ఎన్నికల్లో దీని ప్రాధాన్యత ఎంత?

-

నోటా.. అనగా నన్ ఆఫ్ ది ఎబోవ్. అంటే.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో నాకు ఎవరూ నచ్చలేదు.. అని ఓటరు ఈ నోటా బటన్‌ను నొక్కుతాడు. ఓటరు ఎన్నికల్లో ఓటు వేస్తాడు కానీ.. ఏ అభ్యర్థికీ వేయడు. కేవలం నోటాకు వేస్తాడు. దీని వల్ల ఏ అభ్యర్థికీ ఆ ఓటు పడదు. నోటా ఆప్షన్‌ను ఓటింగ్‌లో పొందుపరచాలని భారత ఎన్నికల కమిషన్ 2009లో సుప్రీంకోర్టును అభ్యర్థించింది. అయితే.. అప్పటి ప్రభుత్వం నోటాను వ్యతిరేకించింది. తర్వాత సెప్టెంబర్ 2013లో సుప్రీంకోర్టు నోటా ఆప్షన్‌ను ఓటింగ్‌లో పొందుపరచాలని ఈసీకి మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి ఓటరుకు కూడా నోటాకు ఓటు వేసే హక్కు ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. ఏ అభ్యర్థి నచ్చకపోతే నిరభ్యంతరంగా నోటాకు ఓటేయవచ్చని సుప్రీం తెలిపింది. దీంతో అప్పటి నుంచి నోటాను ఈసీ.. ఈవీఎం మిషన్‌లో ఏర్పాటు చేసింది.

కానీ.. నోటా వల్ల అభ్యర్థులకు వచ్చిన నష్టమేమీ లేదు. నోటాను ఉపయోగించడం వల్ల అభ్యర్థులు ఆ ఎన్నికల్లో గెలవకుండా మాత్రం ఓటరు ఆపలేడు. అంటే ఓటరుకు అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేసే హక్కు ఉంది.. కానీ.. అభ్యర్థి ఆ ఎన్నికల్లో గెలవకుండా నోటాకు ఓటు వేసి ఆపలేడు. నోటాకు వేసే ఓట్లను ఎన్నికల కమిషన్ లెక్కిస్తుంది. కానీ.. వాటిని ఇన్‌వాలిడ్ ఓట్ల కిందికి లెక్కిస్తుంది. దాని వల్ల నోటాకు ఓటేసినా.. ఎన్నికల ఫలితాలను నోటా ఓట్లు ప్రభావితం చేయలేవు.

ఉదాహరణకు.. ఎన్నికల్లో పోలైన 100 ఓట్లలో 99 ఓట్లు నోటాకు పడి.. ఎక్స్ అనే అభ్యర్థికి ఒక ఓటు పడినా.. ఎక్స్ అనే అభ్యర్థి ఆ ఎన్నికల్లో గెలిచినట్టే లెక్క. ఒక్క వాలిడ్ ఓటుతో ఆ అభ్యర్థి గెలుస్తాడు. మిగితా 99 ఓట్లను ఇన్‌వాలిడ్ ఓట్లుగా ఈసీ పరిగణిస్తుంది.

నోటా ఓట్లను పరిగణించనప్పుడు వేయడం ఎందుకు?
ఈ డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. అయితే.. నోటా వల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులెవరూ తమకు ఇష్టం లేదని ఓటరు నోటా ద్వారా చెప్పుకోవచ్చు. ఇది మరో రకంగా పోలింగ్ శాతాన్ని పెంచుతుంది. సాధారణంగా కొంతమందికి ఏ అభ్యర్థీ నచ్చకపోతే ఓటేయరు. కానీ.. నోటా వల్ల అభ్యర్థులు నచ్చకపోయినా వెళ్లి నోటాకు ఓటేసి వస్తున్నారు. అంటే.. ఓటర్లు ఈ నోటాకు ఎంతో కొంత ప్రభావితం అవుతున్నారు. పోలింగ్‌లో భాగస్వామ్యం అవుతున్నారు. దీని వల్ల ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది. బోగస్ ఓట్లను తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఓటేయని వాళ్ల పేర్లతో కొంత మంది దొంగ ఓట్లు వేస్తుంటారు. నోటాతో వాటిని కూడా తగ్గించవచ్చు. నెగెటివ్ ఓటింగ్ ఎన్నికల్లో, రాజకీయ పార్టీల్లో సిస్టమిక్ చేంజ్‌ను తీసుకొస్తుందని.. అది సరైన అభ్యర్థులు పోటీకి దిగేలా చేస్తుందని మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పీ సదాశివం తెలిపారు.

నోటాకు ఓటెలా వేయాలంటే?
ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన ఈవీఎంలలో అభ్యర్థులందరి తర్వాత.. చివర నోటా ఆప్షన్ ఉంటుంది. నోటా ప్రవేశపెట్టకముందు.. ఏ అభ్యర్థికీ ఓటు వేయడం ఇష్టం లేని ఓటర్లు.. ప్రిసైడింగ్ అధికారి దగ్గరికి వెళ్లి ఏ అభ్యర్థికీ తను ఓటు వేయదలుచుకోవట్లేదని వెల్లడించేవారు. దీంతో ప్రిసైడింగ్ ఆఫీసర్ రిజిస్టర్‌లో ఆ ఓటరు పేరు రాసుకొని సంతకం తీసుకుంటాడు. కాకపోతే అది చాలామందికి తెలియదు. ఇప్పుడు ఉన్న నోటా ఆప్షన్‌తో ఈజీగా నెగెటివ్ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version