వ్యాపారానికి లోన్ కావాలా..? ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు లోన్..!

-

ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న కింద బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు ముద్ర రుణాల‌ను మ‌న‌కు అందిస్తుంటాయి. 2015లో ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించారు. కాగా ఈ ప‌థ‌కం కింద ఎలాంటి గ్యారంటీ, ష్యూరిటీ లేకుండానే రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాల‌ను పొంద‌వ‌చ్చు.

సాధార‌ణంగా మ‌నలో ఎవ‌రైనా స‌రే.. ఏదైనా వ్యాపారం చేయాల‌నుకుంటే.. లోన్ తీసుకోవాల్సి వ‌స్తే.. ఏదో ఒక ప్రాప‌ర్టీని ష్యూరిటీగా చూపించి లోన్ పొందాల్సి ఉంటుంది. అంతేకానీ ష్యూరిటీ లేకుండా దాదాపుగా ఏ బ్యాంకు కూడా రుణాల‌ను ఇవ్వ‌దు. అయితే కొంద‌రికి ష్యూరిటీ పెట్టేందుకు ఎలాంటి ఆస్తులు ఉండ‌వు. దీంతో వారు త‌మ వ్యాపార ఆలోచ‌న‌ను విర‌మించుకుంటారు. అయితే అలాంటి వారు కంగారు ప‌డాల్సిన ప‌నిలేదు. వ్యాపారం చేయాల‌నే త‌మ ఆలోచ‌నను విర‌మించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే.. అలాంటి వారి కోస‌మే కేంద్ర ప్ర‌భుత్వం ముద్ర రుణాల‌ను అందిస్తోంది. ఈ రుణాల‌ను పొందేందుకు ఎలాంటి ష్యూరిటీ పెట్టాల్సిన అవ‌స‌రం లేదు. పైగా గ‌రిష్టంగా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాల‌ను పొంద‌వ‌చ్చు.

మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్ నే MUDRA (ముద్ర‌) అని అంటారు. ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న కింద బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు ముద్ర రుణాల‌ను మ‌న‌కు అందిస్తుంటాయి. 2015లో ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించారు. కాగా ఈ ప‌థ‌కం కింద ఎలాంటి గ్యారంటీ, ష్యూరిటీ లేకుండానే రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాల‌ను పొంద‌వ‌చ్చు. ఇక వ్యాపార రంగంలో స్థిర ప‌డ‌దామ‌నుకునే వారికి ముద్ర రుణాలు ఎంతగానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

ముద్ర యోజ‌న ప‌థ‌కంలో శిశు, కిషోర్‌, త‌రుణ్ పేరుతో మూడు ర‌కాల రుణాల‌ను అందిస్తున్నారు. శిశు విభాగంలో రూ.50వేల వ‌ర‌కు రుణం ఇస్తారు. అలాగే రూ.50వేల పైన రూ.5 ల‌క్ష‌ల లోపు రుణం అయితే కిషోర్ విభాగం కింద‌, రూ.5 ల‌క్ష‌ల పైన రూ.10 ల‌క్ష‌ల లోపు వ‌ర‌కు త‌రుణ్ విభాగం కింద రుణాల‌ను ఇస్తారు. ఈ రుణాల‌ను బ్యాంకులే ఇస్తాయి. అయితే శిశు విభాగం కింద ద‌ర‌ఖాస్తు చేసుకుంటే రుణం త్వ‌ర‌గా వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా కేంద్ర ప్ర‌భుత్వం ఈ ముద్ర రుణాల ప‌థ‌కాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప‌థ‌కం కింద చిరు వ్యాపారులు, దుకాణాలు నిర్వ‌హించేవారు, సేవా రంగంలో ఉన్న‌వారు, నిరుద్యోగులు, గృహిణులు కూడా రుణాల‌ను తీసుకోవ‌చ్చు. మైక్రో యూనిట్స్‌కు ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ ల‌భిస్తుంది. ఇక ఈ రుణాల‌తో ట్రాన్స్‌పోర్ట్ వాహ‌నాల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఆటోలు, ఇ-రిక్షాలు, ప్యాసింజ‌ర్ కార్లు, ట్యాక్సీల కొనుగోలుకు కూడా ముద్ర రుణాలు పొంద‌వ‌చ్చు.

అలాగే సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జిమ్‌లు, బొటిక్‌లు, టైల‌ర్ షాపులు, డ్రై క్లీనింగ్ షాపులు, సైకిల్‌, మోటార్ సైకిల్ రిపేర్ షాపులు పెట్టేందుకు, డీటీపీ సెంట‌ర్ల‌కు, ఫొటోకాపీయింగ్ (జిరాక్స్‌) సెంట‌ర్ల‌కు, మెడిక‌ల్ షాపుల‌కు, కొరియ‌ర్ స‌ర్వీస్ పెట్టేందుకు కూడా ఈ రుణాల‌ను పొంద‌వ‌చ్చు. అలాగే స్వ‌యం ఉపాధి కింద స్వ‌గృహ ఫుడ్స్ త‌యారు చేసే వారు, చిన్నపాటి క్యాంటీన్లు లేదా హోట‌ల్స్ నిర్వ‌హించే వారు, దుస్తుల షాపుల‌ను పెట్టుకునేందుకు కూడా ముద్ర ప‌థ‌కం కింద రుణాల‌ను ఇస్తారు.

ముద్ర ప‌థ‌కం కింద రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి ముద్ర కార్డుల ద్వారా వ‌ర్కింగ్ క్యాపిట‌ల్ లోన్ ఇస్తారు. లోన్ మంజూరైన వారికి నేష‌నల్ పేమెంట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా రూపే బ్రాండింగ్ తో ముద్రించిన ముద్ర కార్డును ఇస్తుంది. ఇక మంజూరైన రుణం బ్యాంకు అకౌంట్‌లో ఉంటుంది. దాన్ని.. అవ‌స‌రాన్ని బ‌ట్టి ముద్ర కార్డు ద్వారా డ్రా చేసుకోవ‌చ్చు. కాగా ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు ఎలాంటి గ్యారంటీ లేకుండానే ముద్ర ప‌థ‌కం కింద రుణం అందిస్తారు. దీన్ని 5 సంవ‌త్స‌రాల్లో క‌ట్టాల్సి ఉంటుంది. కాగా 2019-20 ఆర్థ‌క సంవ‌త్స‌రంలో ముద్ర ప‌థ‌కం కింద రూ.3 ల‌క్ష‌ల కోట్ల ముద్ర రుణాల‌ను అందిస్తార‌ని తెలిసింది. 2019 మార్చి నాటికి సుమారుగా 5 కోట్ల మంది రూ.2.82 ల‌క్ష‌ల కోట్ల ముద్ర రుణాల‌ను పొందుతార‌ని సంబంధిత అధికారులు అంచ‌నా వేస్తున్నారు..!

Read more RELATED
Recommended to you

Latest news