పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)కు చెందిన ఎయిర్‌బస్ 320 విమానం ఇటీవలే కరాచీ ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో కుప్పకూలిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో విమాన సిబ్బంది సహా మొత్తం 107 మంది వరకు చనిపోయారు. అయితే సదరు విమానం 15 ఏళ్ల కిందటిదట. దాన్ని 5 ఏళ్ల కిందట చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ నుంచి పాకిస్థాన్ కొనుగోలు చేసింది. చాలా పాతబడ్డ డొక్కు విమానం కావడం వల్లే అందులో సాంకేతిక లోపం వచ్చి కూలిందని అసలు విషయం వెల్లడైంది.
కాగా ఆ విమానం ల్యాండింగ్ గేర్ ఫెయిలైంది. దీంతో పైల్ బెల్లీ ల్యాండింగ్ చేయించేందుకు యత్నించాడు. కానీ అది కూడా కుదరలేదు. ఇంజిన్ ఫెయిలైంది. ఫలితంగా 107 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నిజానికి ఆ విమానాన్ని 2004లో తయారు చేశారట. అనంతరం దాన్ని 10 ఏళ్ల పాటు చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ వారు వాడారు. దాన్ని ఆ తరువాత అక్టోబర్ 2014లో పీఐఏ కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఆ విమానాన్ని నడిపిస్తున్నారు. కానీ అది పాత విమానం కనుక అందులో సాంకేతిక లోపం వచ్చి కూలిపోయింది.
ఇక ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 41 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 3 రోజుల్లో పూర్తి స్థాయిలో శకలాలను క్లియర్ చేస్తామని అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో ఇద్దరు బతికే ఉన్నట్లు తెలిసింది. వారి వివరాలను అధికారులు వెల్లడించలేదు.