బీసీల అపనమ్మకంలో తప్పెవరిదంటావ్ అచ్చెన్నా?

-

మహానాడు వేదికగా మైకందుకున్న అచ్చెన్నాయుడు “బలిపీఠంపై బడుగుల సంక్షేమం” అనే శీర్షికపై తనదైన రీతిలో ప్రసంగించారు! బీసీ కార్పొరేషన్‌ కు కేటాయించిన నిధులన్నీ మళ్లించి కొత్త పథకాలకు ఇస్తున్నారని ఆరోపించారు. కొత్తవాటి కింద ఇరవై శాతం కూడా అర్హులకు ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. ఏడాదికాలంలో బీసీ కార్పొరేషన్‌ నుంచి ఒక్క రుణం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఈ ఆరోపణల్లో నిజానిజాల సంగతి కాసేపు పక్కనపెడితే… ఈ సందర్భంగా ఇంతకాలం టీడీపీకి వెన్నెముఖగా తోడున్న బీసీలపై అచ్చెన్న స్పందన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది!

ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీల కోసం దేశంలో మొదటిసారి సబ్‌ ప్లాన్‌ తెచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అని మొదలుపెట్టిన అచ్చెన్న… పదేళ్లపాటు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు బీసీ సంక్షేమం కోసం పదివేల కోట్లు ఖర్చు పెడితే గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలోనే రూ.41 వేల కోట్లు ఖర్చు పెట్టిందని తెలిపారు. ఈమాటకు “అందుకే కదా కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి” అని వినిపిస్తున్న కామెంట్ సంగతి కాసేపు పక్కనపెడితే… ఆల్ మోస్ట్ భూస్థాపితం అయిపోయిన పార్టీతో ఈ సమయంలో అచ్చెన్న పోల్చుకోవడం మాత్రం తమ్ముళ్లను కాస్త ఇబ్బందికి గురిచేసిందనే చెప్పాలి!

ఇదే ఫ్లో కంటిన్యూ చేసిన అచ్చెన్న… తమ ప్రభుత్వంలో ఎంత చేసినా గత ఎన్నికల సమయంలో బీసీ వర్గాలు టీడీపీపై కొంత అపనమ్మకం ఏర్పరచుకుని దూరమయ్యాయని అభిప్రాయపడ్డారు! వారికి అపనమ్మకం ఎందుకు ఏర్పడింది, ఆ అపనమ్మకానికి కారణమైన తమ పాలనలో లోపాలు ఏమిటి అనే దిశగా ఆత్మవిమర్శ చేసుకోవడం మానేసిన టీడీపీ నేతలు… తాము ఎంతో చేశామని ఇప్పటికీ ఆత్మవంచన చేసుకుంటూ.. నేరం అంతా బీసీలదే అన్నట్లు మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి! మేము ఎంతో చేశాం… అయినా కూడా బీసీలు మాకు ఓట్లు వెయ్యలేదన్నట్లుగా అచ్చెన్న మాట్లాడటం ప్రజాస్వామ్యంలో సరైన పద్దతి కాదనేది వారి అభిప్రాయం!

ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయంపై ఆత్మవిమర్శ చేసుకునే దిశగా మహానాడులో ఒక్క చర్చా జరగలేదు సరికదా… బీసీలు ఎందుకో కానీ టీడీపీ ఎంత చేసినా నమ్మలేదు అన్నట్లుగా మాట్లాడటం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా… ఈ పరిస్థితుల్లో అలాంటి ఆత్మవిమర్శలు పార్టీకీ మంచి చేస్తాయి తప్ప… నేరం మాది కాదు అన్నట్లుగా ప్రసంగాలు చేయడం వల్ల ఒరిగేదీ ఏమీ ఉండదని పలువురు సూచిస్తున్నారు!

 

Read more RELATED
Recommended to you

Latest news