జూలై 1 నుంచి 31వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అమలు కానున్న అన్‌లాక్ 2.0 సందర్భంగా ప్రధాని మోదీ మంగళవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించిన విషయం విదితమే. అయితే ఆయన దేశ ప్రజల్లో నిర్లక్ష్యం బాగా పెరిగిపోయిందని వ్యాఖ్యలు చేశారు. లాక్‌డౌన్‌ను చాలా కట్టుదిట్టంగా అమలు చేశామని, అందువల్లే కరోనా కేసులు తక్కువగా ఉన్నాయని, మరణాలను ఎక్కువ సంఖ్యలో సంభవించకుండా ఆపగలిగామని మోదీ అన్నారు.
అయితే అన్‌లాక్ 1.0 లో ప్రజలు పూర్తిగా బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించారని మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాస్కులను ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లను వాడడం వంటి విషయాల్లో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని అన్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. నిజంగానే జనాలు నిర్లక్ష్యంగా ఉండడం వల్లే దేశంలో కరోనా కేసులు బాగా పెరిగిపోయాయని అటు వైద్య నిపుణులు కూడా అంటున్నారు.
బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా రాదని తెలిసి కూడా కొందరు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని పలువురు అంటున్నారు. అసలు కరోనా ఉందని, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా దాని బారిన పడాల్సి వస్తుందనే విషయం తెలిసి కూడా.. కొందరు అసలు జాగ్రత్తలు పాటించకుండా అత్యంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు. అయితే మోదీ, వైద్య నిపుణులు చేస్తున్న వ్యాఖ్యల్లోనూ నిజం ఉంది. ఎందుకంటే.. న్యూజిలాండ్ సహా పలు దేశాలు కరోనా నుంచి బయట పడ్డాయంటే అది ఆ దేశాల ప్రభుత్వాల ఘనతేమీ కాదు. అక్కడి ప్రజలు చాలా క్రమశిక్షణతో నడుచుకున్నారు. నిబంధనలను తూచా తప్పకుండా పాటించారు. కనుకనే ఆయా దేశాల్లో కరోనా కట్టడి సాధ్యమైంది.
ఇప్పటికీ ఆయా దేశాల్లో కరోనా కేసులు వస్తున్నా.. అవి కేవలం సింగిల్ నంబర్‌కే పరిమితమవుతున్నాయి. కనుక.. కరోనా కట్టడి కావాలంటే.. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయడం ఎంత అవసరమో.. ప్రజలు కూడా క్రమశిక్షణతో ఉండడం అంతే అవసరం.. లేకపోతే ఇంకో ఏడాది కాదు, ఎన్నేళ్లయినా.. వ్యాక్సిన్ రానంత వరకు కరోనా మనతోనే ఉంటుంది. అది ఎంతో మందిని తనతో తీసుకుపోతుంది. అది మాత్రం ఖాయం.. కనుక నిర్లక్ష్యం వీడండి.. ఇప్పటికైనా క్రమశిక్షణ, జాగ్రత్తలతో కరోనాను తరిమేందుకు ప్రభుత్వాలకు సహకరించండి..!