భారత్ లో రోజురోజుకి కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో దాని నుండి రక్షణగా మాస్క్ ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మార్కెట్లో రకరకాల మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. బ్రాండ్ ను బట్టి వాటి ఖరీదు ఉంటుంది. కొన్ని మాస్కుల ధర 50 రూపాయల లోపు ఉంది. కొన్నింటి ఖరీదు వందలు, వేల రూపాయాల్లో ఉంది. కానీ, పుణెలోని పింప్రి చించ్వాడకు చెందిన శంకర్ కుర్ హేడ్ అనే వ్యక్తి సుమారు 2 లక్షల 90 వేల ఖరీదైన గోల్డెన్ మాస్క్ ను తయారు చేయించుకున్నాడు.
ఈ మాస్క్ కోసం సుమారు అయిదున్నర తులాల బంగారం వాడినట్లు తెలుస్తోంది. ఈ గోల్డ్ మాస్క్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీన్ని ధరిస్తున్న కారణంగా శంకర్ ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయాడు. శంకర్ అయిదు చేతి వేళ్లకు బంగారు ఉంగరాలు కూడా ఉన్నాయి. అతని మెడలో భారీ పుత్తడి దండ కూడా ఉన్నది. ఇప్పటికే ధగధన మెరుస్తున్న అతనికి ఇప్పుడు గోల్డెన్ మాస్క్ కూడా తోడైంది. దీన్ని బట్టి శంకర్ సంపన్నుడు అనే విషయం అర్థమవుతోంది.