చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం కారణంగా భారత్.. చైనాకు చెందిన 59 యాప్స్‌ను నిషేధించిన విషయం విదితమే. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఈఐటీవై) మంత్రిత్వ శాఖ సదరు యాప్స్‌ను నిషేధిస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అయితే జూలై 22వ తేదీ తరువాత ఆ యాప్స్‌లో ఒకటైన టిక్‌టాక్ మళ్లీ భారత్‌లో రీ ఎంట్రీ ఇస్తుందని అనుకుంటున్నారు.
నిషేధించబడిన యాప్స్ యాజమాన్యాలకు ఎంఈఐటీవై 79 ప్రశ్నలను సంధిస్తూ ఓ జాబితాను ఇదివరకే పంపించింది. జూలై 22వ తేదీ లోపు ఆయా యాప్‌లకు చెందిన యాజమాన్యాలు ఆ ప్రశ్నలకు సమాధానాలివ్వాలి. తమ సమాధానాలను సదరు మంత్రిత్వ శాఖకు పంపాలి. అలా చేయని పక్షంలో ఆ యాప్స్‌ను పూర్తిగా నిషేధిస్తారు. అయితే టిక్‌టాక్ ఇప్పటికే పలుమార్లు డేటా ప్రైవసీపై స్పష్టతనిచ్చింది. దీంతో టిక్‌టాక్ ఈ ప్రశ్నలకు సంతృప్తికర సమాధానాలు ఇస్తుందని తెలుస్తోంది. అదే జరిగితే జూలై 22వ తేదీ తరువాత టిక్‌టాక్ భారత్‌లో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుందని పలువరు అంటున్నారు.
అయితే ఆ 79 ప్రశ్నలకు సమాధానం ఇచ్చినా.. నిర్ణయం మాత్రం కేంద్రం చేతుల్లో ఉంటుంది కనుక.. అంత త్వరగా టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేస్తారని కూడా మనం అనుకోలేం. ఇప్పుడిప్పుడే చైనాతో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుతున్నాయి. ఆ దేశం తమ సైనికులను సరిహద్దుల నుంచి వెనక్కి మళ్లించింది. అయితే జూలై 22 కాకపోయినా.. తరువాత కొద్ది రోజులకు అయినా సరే.. టిక్‌టాక్ యాప్ ఒక్కటి మాత్రం మళ్లీ భారత్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ యాప్ వల్ల కేంద్రానికి కూడా ఆదాయం వస్తున్న నేపథ్యంలో దానిపై నిషేధం విధించడం ఎందుకు ? అని భావిస్తే.. టిక్‌టాక్ మళ్లీ భారత్‌లోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలా జరగకపోతే.. టిక్‌టాక్ ఇక దేశంలో శాశ్వతంగా నిషేధానికి గురైనట్లేనని భావించవచ్చు. మరి జూలై 22 తరువాత ఏం జరుగుతుందో చూడాలి.