దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న టమాటా ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం కిలో టమాటాల ధర రూ.70కి పైగానే పలికింది. అక్కడే కాదు.. అనేక చోట్ల కిలో టమాటా ధరలు రూ.60కి పైగానే ఉన్నాయి. అకస్మాత్తుగా సరఫరా తగ్గిపోవడంతోనే ఇలా టమాటాల ధరలకు రెక్కలు వచ్చాయని వ్యాపారులు అంటున్నారు.
జూన్ 1వ తేదీ నుంచి టమాటాల ధరలు కేజీకి రూ.10 చొప్పున వారం వారం పెరుగుతూనే ఉన్నాయి. దేశంలోని అనేక నగరాలు, పట్టణాలతోపాటు ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న టమాటాలకు కూడా ధరలు పెరిగాయి. ఆన్‌లైన్‌లో 1 కిలో టమాటాలను రూ.66 వరకు విక్రయిస్తున్నారు. కనీస ధర రూ.53 గా ఉంది. ఇక క్వాలిటీ ఉన్న టమాటాలు కావల్సి వస్తే రూ.70కి పైగానే చెల్లించాల్సి వస్తోంది.
కోవిడ్ కారణంగా అనేక ప్రాంతాల్లో నిబంధనలు విధించడంతో సరుకు రవాణాకు ఆటంకం ఏర్పడుతోంది. అలాగే పలు చోట్ల టమాటా పంటలను కోయడం లేదని తెలుస్తోంది. దీని వల్లే టమాటాల ఉత్పత్తి తగ్గింది. దీంతో క్రమంగా వాటి రేటు పెరుగుతోంది. టమాటాల ధరలు పెరుగుతున్నాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా కూడా చెబుతోంది. అయితే సీజన్ మారుతున్నందునే వీటి సప్లై తగ్గిందని, మరికొద్ది రోజుల పాటు టమాటాల ధరలు ఇలాగే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. తరువాత ధరలు క్రమంగా తగ్గుతాయని అంటున్నారు.
దేశంలో ఏటా 19.73 మిలియన్ టన్నుల టమాటాలను పండిస్తున్నారు. 11.51 మిలియన్ టన్నుల టమాటాలను వాడుతున్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.