అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే వైెస్ జగన్ తో పాటు ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర చైర్మన్ శొంఠి నాగరాజు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేని వారికి అసలు పదవులు ఎందుకని ప్రశ్నించారు. ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీకి వెళ్లి.. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన జగన్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం కరెక్ట్ కాదన్నారు షర్మిల.
ప్రజల తరఫున నిలబడలేనప్పుడు అలాంటి పదవి ఆయనకు అవసరం లేదని.. జగన్ ఎమ్మెల్యే పదవీకి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు షర్మిల. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 11 నుంచి జరుగనుండగా.. ఈ సెషన్ కు దూరంగా ఉండాలని నిన్న మాజీ సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.