పూణెలో ఇటీవలే ఓ వ్యక్తి బంగారంతో చేసిన మాస్కులను ధరించి షాకిచ్చిన విషయం తెలిసిందే. ఇక గుజరాత్‌లోని సూరత్‌లోనూ పలువురు బంగారం వ్యాపారులు వజ్రాలు, బంగారంతో తయారు చేసిన మాస్కులను ఒక్కొక్కటి రూ.4 లక్షల ధరకు విక్రయిస్తున్నారు. అయితే వారి నుంచి ప్రేరణ పొందాడో ఏమో తెలియదు కానీ.. ఒడిశాలోని కటక్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా బంగారంతో తయారు చేసిన మాస్కును ధరించాడు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కటక్‌కు చెందిన వ్యాపారవేత్త అలోక్ మహంతీకి మొదట్నుంచీ బంగారం అంటే మక్కువ ఎక్కువ. అందుకనే అతను బంగారు చెయిన్లు, రింగ్స్, బ్రేస్‌లెట్లు, ఇతర ఆభరణాలు, వాచ్‌లు, క్యాప్‌లు ధరించి కనిపిస్తుంటాడు. అన్నీ బంగారంతో చేసినవే. ఈ క్రమంలో కరోనా నేపథ్యంలో బంగారంతో చేసిన మాస్కును కూడా ధరించాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వెంటనే మాస్కుకు ఆర్డర్ ఇచ్చాడు.
ఇక ఓ బంగారం వ్యాపారి అతని నుంచి కరోనా గోల్డ్ మాస్క్ తయారీకి ఆర్డర్ తీసుకుని 22 రోజులపాటు పనిచేసి ఆ మాస్క్‌ను తయారు చేసి మహంతీకి ఇచ్చాడు. దాని విలువ రూ.3.50 లక్షలు. అందులో మొత్తం 100 గ్రాముల వరకు బంగారాన్ని వాడారు.
అయితే డబ్బున్న వారు ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా అదే మొత్తాన్ని పేదలకు కరోనా చికిత్స అందించేందుకు ఉపయోగిస్తే బాగుంటుందని సామాజిక వేత్తలు హితవు పలుకుతున్నారు. ప్రస్తుతం కరోనా వల్ల ఎంతో మందికి సరైన వైద్యం అందడం లేదని, అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారని, ఆకలి చావులు ఏర్పడుతున్నాయని.. అలాంటి వారికి సహాయం చేస్తే బాగుంటుంది కానీ.. ఇలా గోల్డ్ మాస్కులు తయారు చేసుకుని ధరిస్తే.. ఏం ప్రయోజనం ఉంటుంది ? అది ఎవరికి లాభం ? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయినా.. కొందరు అంతే.. బంగారమనేది చాలా మందికి అత్యంత ప్రియమైన వస్తువు. దాన్ని దగ్గర ఉంచుకునేందుకే చాలా మంది యత్నిస్తారు కానీ.. ఇతరులకు సేవ చేయాలంటే.. ఎవరూ ముందుకు రారు కదా.. ఏదేమైనా.. ప్రస్తుతం ఈ గోల్డ్ మాస్క్ వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.