కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో సోమవారం (20-07-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. కరోనా నేపథ్యంలో అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్‌ను వాయిదా వేస్తున్నట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. సోమవారం వర్చువల్ సమావేశం నిర్వహించిన ఐసీసీ బోర్డు సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా వరల్డ్ కప్ నిర్వహణపై తర్జన భర్జనలు పడుతున్న ఐసీసీ ఎట్టకేలకు టోర్నీని వాయిదా వేయడంతో ఐపీఎల్ 2020 టోర్నీకి లైన్ క్లియర్ అయింది. దీంతో బీసీసీఐ ఐపీఎల్‌ను నిర్వహించే తేదీలను వెల్లడించే అవకాశం ఉంది.
2. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకాల సంయుక్త భాగస్వామ్యంలో తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్‌కు చేపట్టిన ఫేజ్ 1, 2 హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ ఫలితాల డేటాను సోమవారం విడుదల చేశారు. అందులో వ్యాక్సిన్ ఏ విధంగా పనిచేసిందీ వారు వెల్లడించారు. వ్యాక్సిన్‌ను తీసుకున్న 1077 మందిలో ఎలాంటి తీవ్రమైన సమస్యలు రాలేదని, స్వల్ప అనారోగ్య లక్షణాలు కనిపించాయని, అందువల్ల ఈ వ్యాక్సిన్ సేఫ్ అని తేల్చారు.
3. ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4074 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 53,724కు చేరుకుంది. 28,800 యాక్టివ్ కేసులు ఉండగా, 24,228 కోలుకున్నారు. మొత్తం 696 మంది చనిపోయారు.
4. కరోనా కట్టడిలో విఫలమయ్యారంటూ రాష్ట్ర హైకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై మండి పడింది. రాష్ట్రంలో కరోనాపై సోమవారం హైకోర్టులో విచారించారు. కోర్టు ఆదేశాలను పాటించకపోతే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని కోర్టు హెచ్చరించింది. కరోనా పరీక్షలు తక్కువగా చేస్తున్నారని, మీడియాకు ఇస్తున్న బులెటిన్‌లో స్పష్టత లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
5. స్వీడన్‌కు చెందిన లైఫ్ సైన్సెస్ సంస్థ ఎంజైమాటికా తయారు చేసిన కోల్డ్ జైమ్ అనే మౌత్ స్ప్రే ద్వారా కేవలం 20 నిమిషాల్లో కరోనా 98 శాతం వరకు నశిస్తుందని వెల్లడైంది. ఈ స్ప్రేను నోరు, గొంతులో స్ప్రే చేసుకోవాలి. దీంతో కరోనానే కాదు, ఇతర వైరస్‌లు నశిస్తాయని తెలిపారు.
6. భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవ్యాక్సిన్‌కు గాను హైదరాబాద్ నిమ్స్‌లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. సోమవారం ఇద్దరు వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా మొత్తం 375 మందిపై ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు భారత్ బయోటెక్ తెలియజేసింది.
7. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 40,425 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,18,043కు చేరుకుంది. మొత్తం 3,90,459 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 7,00,087 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒక్క రోజులోనే 681 మంది చనిపోయారు. 27,497 మొత్తం మరణాలు చోటు చేసుకున్నాయి.
8. ఏపీలో సోమవారం నుంచి జూలై 28వ తేదీ వరకు పేదలకు ఉచితంగా సరుకులను పంపిణీ చేయనున్నారు. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వారు ఇందులో భాగంగా లబ్ధి పొందనున్నారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం, 1 కిలో శనగలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు.
9. కరోనా వైరస్‌కు గాను ఆగస్టు నెలలోనే వ్యాక్సిన్‌ను విడుదల చేయనున్నట్లు రష్యా ప్రకటించింది. ఈ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలియజేశారు. ఆగస్టు 3వ తేదీ నుంచి ఈ వ్యాక్సిన్‌కు 3వ దశ క్లినికల్ ట్రయల్స్ చేపడుతారు. అదే సమయంలో వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తారు. అనంతరం ప్రజలకు పంపిణీ చేస్తారు.
10. దేశంలో కోవిడ్ 19 సమూహ వ్యాప్తి లేదని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా స్పష్టం చేశారు. అందుకు ఆధారాలేమీ లేవన్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందుతుందన్నారు. దేశంలో కరోనా వైరస్ మరణాల రేటు ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉందన్నారు.