కరోనా వైరస్‌కు గాను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఇండియాకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ కలసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే సదరు వ్యాక్సిన్‌కు చెందిన ఫేజ్ 1, 2 ట్రయల్స్ ఫలితాలను కూడా తాజాగా ఆక్స్‌ఫర్డ్ విడుదల చేసింది. అందులో సత్ఫలితాలు వచ్చాయి. దీంతో వ్యాక్సిన్‌ను ఫేజ్ 3 ట్రయల్స్ కోసం సిద్ధం చేస్తున్నారు. అయితే ఇదే విషయమై సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా మీడియాతో మాట్లాడారు.
తాము ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తయితే అందులో దేశంలో తయారు చేసే వ్యాక్సిన్ నుంచి 50 శాతం వ్యాక్సిన్‌ను ఇండియాకే అందజేస్తామని అదర్ పూనావాలా తెలిపారు. ఇక ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదని, ఎందుకంటే ప్రభుత్వాలే వ్యాక్సిన్‌ను కొని ప్రజలకు పంపిణీ చేస్తాయని అన్నారు. కాగా భారత్‌లో తమ వ్యాక్సిన్‌కు ఫేజ్ 3 ట్రయల్స్ కోసం దరఖాస్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఫేజ్ 3 ట్రయల్స్ విజయవంతం అయ్యాక వ్యాక్సిన్‌ను ముందుగా కొన్ని మిలియన్ల సంఖ్యలో ఉత్పత్తి చేస్తామని, అందులో నెలా నెలా సగం వ్యాక్సిన్‌ను ఇండియాకే ఇస్తామని తెలిపారు. ఇక 2021 ఆరంభం వరకు 300 నుంచి 400 మిలియన్ల వ్యాక్సిన్ డోసులను తయారు చేస్తామన్నారు. వ్యాక్సిన్‌ను రూ.1వేయి కన్నా తక్కువకే అందించాలని చూస్తున్నామని, కరోనా వల్ల మానవతను దృష్టిలో ఉంచుకుని వ్యాక్సిన్‌ను ఎక్కువకు అమ్మలేమని తెలిపారు. ఆఫ్రికా దేశాలకు ఒక్క డోసును కేవలం 2 నుంచి 3 డాలర్లకే అందించేందుకు ఒప్పుకున్నామని తెలిపారు.