కోవిడ్ 19 వ్యాప్తిని అడ్డుకోవడంతోపాటు దేశంలో మళ్లీ యథాతథంగా అన్ని కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక ఆంక్షలకు సడలింపులు ఇస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ప్రస్తుతం అన్‌లాక్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. జూలై 31వ తేదీ వరకు అన్‌లాక్ 2.0 ముగియనుంది. ఆగస్టు 1 నుంచి అన్‌లాక్ 3.0 ప్రారంభం కానుంది. దీంతో కేంద్రం మరిన్ని ఆంక్షలకు సడలింపులు ఇచ్చేందుకు ప్రణాళికలను రచిస్తోంది.
ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానున్న అన్‌లాక్ 3.0లో సినిమా హాల్స్‌కు అనుమతులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కఠినమైన సోషల్ డిస్టన్స్ నిబంధనలతో సినిమా హాల్స్‌ను ఓపెన్ చేసుకునేందుకు థియేటర్ల యాజమాన్యాలకు అనుమతులు ఇవ్వనున్నారు. అయితే ఈ విషయమై కేంద్ర హోం శాఖ ఇప్పటికే థియేటర్ల యాజమాన్యాలతో మాట్లాడింది. 25 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో థియేటర్లను ముందుగా ఓపెన్ చేసుకునేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కానీ థియేటర్ల ఓనర్లు 50 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీకి అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారట. అయితే దీనిపై మరో నాలుగైదు రోజుల్లో నిర్ణయం తీసుకుని అన్‌లాక్ 3.0 ఆంక్షల సడలింపులో ఆ నిర్ణయాన్ని వెలువరించనున్నారని తెలుస్తోంది.
ఇక అన్‌లాక్ 3.0లో స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కేవలం విద్యార్థుల తల్లిదండ్రులు అంగీకరిస్తేనే.. వారి అంగీకారం మేరకు విద్యాసంస్థలను ఓపెన్ చేస్తామని ఆ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కానీ తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను ఇప్పుడప్పుడే స్కూళ్లకు, కాలేజీలకు పంపే ఆలోచనలో లేరు. అందువల్ల అన్‌లాక్ 3.0లో విద్యాసంస్థలు ఓపెన్ కావని మనకు సమాచారం అందుతోంది.
అలాగే అన్‌లాక్ 3.0లో జిమ్‌లను తెరిచేందుకు అనుమతులు ఇస్తారని సమాచారం అందుతోంది. ఇక మెట్రో రైళ్ల సేవలను కూడా ఇప్పుడప్పుడే ప్రారంభించబోరని తెలుస్తోంది. అయితే జూలై 30వ తేదీ వరకు కేంద్రం అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది. అప్పటి వరకు వేచి చూస్తేనే ఈ విషయంపై స్పష్టత వస్తుంది.