కరోనా నేపథ్యంలో రెస్టారెంట్, హోటల్స్ రంగం తీవ్ర నష్టాలకు గురైంది. అయితే అన్‌లాక్ ప్రక్రియ కొనసాగుతుండడంతో నెమ్మదిగా వారు తమ ఔట్‌లెట్లను ప్రారంభిస్తున్నారు. ఇక ఇప్పటికే పలువురు కరోనా పేరిట చిత్రమైన వంటకాలు చేసి అమ్మారు. కరోనా వైరస్ షేపుల్లో బర్గర్లు, కేకులు, మాస్కుల షేపుల్లో పరోటాలను తయారు చేసి విక్రయించారు. ఈ క్రమంలోనే మరొక రెస్టారెంట్ తాజాగా కరోనా కర్రీని వండి కస్టమర్లకు వడ్డిస్తోంది.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ది వేదిక్ అనే రెస్టారెంట్ వారు కోవిడ్ కర్రీ, మాస్క్ నాన్‌లను కస్టమర్లకు వడ్డిస్తున్నారు. కోవిడ్ కర్రీ అంటే కరోనా వైరస్‌తో చేసింది అనుకునేరు. కానే కాదు. అది నిజానికి మలై కోఫ్తా కర్రీ. అందులో కోఫ్తాలను కరోనా వైరస్ షేప్‌లో తయారు చేశారు అంతే. ఇక నాన్ రోటీలను మాస్కుల రూపంలో తయారు చేశారు. ఇదీ అసలు కథ.
కరోనా వల్ల కస్టమర్లు ఎవరూ రెస్టారెంట్లకు సరిగ్గా రావడం లేదని.. అందుకనే ఇలాంటి వెరైటీ వంటకాలను తయారు చేస్తున్నామని సదరు రెస్టారెంట్ నిర్వాహకులు తెలిపారు. తమ రెస్టారెంట్‌లో అన్ని జాగ్రత్తలను తీసుకుని, పూర్తిగా శుభ్రమైన వాతావరణంలో వంటలను వండుతున్నామని తెలిపారు. అయినప్పటికీ జనాలు మాత్రం కరోనా భయంతో ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే జంకుతున్నారు. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గితేగానీ ఇప్పుడప్పుడే ఏ బిజినెస్ కూడా మళ్లీ పూర్వ స్థితికి వచ్చే అవకాశం లేదని స్పష్టంగా కనిపిస్తోంది. కాగా సదరు కోవిడ్ కర్రీ, నాన్ మాస్క్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.