ఏపీ విశాఖలోగల ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డిసెంబర్ 10న జరగనున్న పూర్వ విద్యార్థుల సమావేశానికి ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా హాజరుకానున్నారు. ఏయూ ఉపకులపతి ఆచార్య జి.నాగేశ్వరరావు, ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావు సోమవారం ముంబైలో రతన్‌టాటాను కలిసి కార్యక్రమానికి హాజరుకావలసిందిగా ఆహ్వానించి, జ్ఞాపికతో సత్కరించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఆయన వారి ఆహ్వానానికి సమ్మతి తెలిపారు.
రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు సూచన మేరకు రతన్‌టాటాను కలిసినట్టు వీసీ తెలిపారు. ఎంతో మంది ప్రముఖులకు దేశానికి పరిచయం చేయడంతో పాటు వారి అలోచనలు, సేవలను ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేయడంలో వారిని ఆంధ్ర విశ్వవిద్యాలయం తీర్చిదిద్దిందని వైస్ చాన్సలర్ పేర్కొన్నారు.