తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న డాక్టర్లు, పోలీసులు కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. చాలా మంది కరోనా నుండి కోలుకుంటున్నా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వారు మృత్యువాత పడుతున్నారు. తాజాగా డీఎస్పీ శశిధర్ కరోనాతో ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న పీఎస్ శశిధర్ కరోనాతో నిన్న మధ్యాహ్నం హైదరాబాద్, నాంపల్లి కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్ను మూశారు.
ఆయన వయసు 50 సంవత్సరాలు. గత నెల 26న శశిధర్‌కు పాజిటివ్ నిర్ధారణ కాగా ఆయన హైదరాబాద్‌లోని నాంపల్లి కేర్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. 1996 బ్యాచ్ ఆర్ఎస్ఐ గా పోలీస్ శాఖ లో చేరిన శశిధర్ బెల్లంపల్లి హెడ్ క్వార్టర్స్ లో విధులు నిర్వహించారు. తర్వాత కరీంనగర్ ఆర్ఐగా, సిరిసిల్ల ఆర్ఐగా విధులు నిర్వహించారు. ప్రమోషన్ ట్రాన్స్ ఫర్ లో భాగంగా ఆయన డీఎస్పీగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చారు. ఆయన స్వస్థలం వరంగల్ కాగా ఆయనకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.