క‌డ‌ప‌లో ఉక్కు ఫ్యాక్ట‌రీ ఏర్పాటుకు క్యాబినేట్ ఆమోదం

-

-18వేల కోట్ల అంచ‌నా వ్య‌యం
-ప్ర‌ధానికి రాసిన లేఖ‌ల‌పై చ‌ర్చ‌
– జ‌న‌వ‌రి నాటికి గ్రామాల్లోనూ అన్నా క్యాంటీన్లు

Chandrababu Naidu Takes Key Decisions In AP Cabinet Meeting

అమరావతి: కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంచిరోజు చూసుకుని నెలలోపే దీనికి శంకుస్థాపన చేయాలని సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు సంస్థలతో కలిసి ప్రభుత్వ జాయింట్ వెంచర్ దిశగా ఈ మేరకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. సోమవారం అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రూ. 18వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనాకు వచ్చి, ఆ మొత్తాన్ని బ్యాంకుల నుంచి రుణ సమీకరణ చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు సమాచారం. మూడు మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో ప్లాంట్‌ ఏర్పాటుకు ఈ మేర కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం పట్ల కేంద్రం చూపుతున్న వివక్షపైనా మంత్రివర్గంలో కీలకంగా చర్చించారు. కడప స్టీల్ ప్లాంట్‌పై ప్రధానికి ఓ లేఖ, విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని మరో లేఖ రాయాలని నిర్ణయించారు. అలాగే, తిత్లీ తుపాను కేంద్రం సాయంపైనా మంత్రివర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. సాయంగా తాము రూ.1200 కోట్లు అడగ్గా.. కేంద్రం కేవలం 229 కోట్లు మాత్రమే ఇచ్చిందని.. దీనిపై కేంద్ర హోంమంత్రికి మరో లేఖ రాయాలని నిర్ణయించారు. దొనకొండ మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయించింది. రామాయపట్నం పోర్టు ఏర్పాటు పైనా ఈ సమావేశంలో కీలక చర్చ జరిగింది. గ్రామీణ నీటి సరఫరా కోసం భారీగా అవసరమయ్యే నిధులను సమీకరించాలని నిర్ణయించారు.

2019 జనవరి 31నాటికి గ్రామీణ ప్రాంతాల్లో అన్న క్యాంటిన్లు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 366 అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేయాలని, మున్సిపాలిటీలో 215, గ్రామీణ ప్రాంతాల్లో 152 ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 124 అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేయగా, గ్రామీణ ప్రాంతాల్లో 152 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నూతనంగా అన్నా క్యాంటీన్ ఛారిటబుల్ ట్రస్టు ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించింది. విశాఖ ల్యాండ్ పూలింగ్ విధానంలో మార్పులు చేర్పులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టుకు పిపిపి విధానంలో చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. మూడు కారిడార్లలో 42.55 కిలోమీటర్ల మేర మెట్రోరైలు ప్రాజెక్టు ఏర్పాటుచేయనున్నట్టు తెలుస్తోంది. గాజువాక నుంచి కొమ్మాది వరకు 30 కిలోమీటర్లు , గురుద్వారా- ఓల్డ్ పోస్ట్ ఆఫీసు 5.25 కి.మీలు, తాటిచెట్లపాలెం నుంచి చైనా వాల్తేరు వరకు 6 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు సమాచారం.

మంత్రివ‌ర్గ నిర్ణ‌యాలు హైలైట్స్‌
కేంద్రం నెరవేర్చని హామీలను రాష్ట్రమే చేపట్టాలని..
– రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్‌ నిర్ణయం
– నెల రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన..
– ప్రైవేట్ సంస్థలతో కలిసి ప్రభుత్వ జాయింట్ వెంచర్ దిశగా ప్రయత్నాలు…
– పీపీపీ మోడల్‌లో వైజాగ్‌ మెట్రో చేపట్టాలని నిర్ణయం
– రూ. 8,300 కోట్లతో 42 కిలోమీటర్ల మేర వైజాగ్ మెట్రో
– ప్రపంచంలోనే పీపీపీ మోడల్‌లో నిర్మితమవుతున్న… రెండో అతి పెద్ద మెట్రో రైల్ ప్రాజెక్టు వైజాగ్ మెట్రో, 4,200 కోట్ల రుణం ఇచ్చేందుకు కొరియా ప్రభుత్వం ముందుకొచ్చింది.
– గాజువాక-కొమ్మాది- 30 కి.మీ, గురుద్వారా- ఓల్డ్ పోస్టాఫీసు-5.25 కి.మీ..
– తాటిచెట్లపాలెం- వాల్తేరు మధ్య 6.5 కి.మీ మెట్రో రైలు
– అన్న క్యాంటీన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు
– గ్రామీణ ప్రాంతాల్లో 152 అన్న క్యాంటీన్ల ఏర్పాటు
– రాష్ట్ర వ్యాప్తంగా 366 అన్న క్యాంటిన్లు ఏర్పాటు
– మున్సిపాలిటీలో 215, గ్రామీణ ప్రాంతాల్లో 152 క్యాంటిన్లు ఏర్పాటు
– వచ్చే జనవరి 31నాటికి గ్రామీణ ప్రాంతాలలో అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేయాలని ఆమోదం తెలుపుతూ కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. కాగా రామాయపట్నం పోర్ట్ ఏర్పాటుపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది.

తిత్లీ బాధితుల మ‌ధ్య దీపావ‌ళి- సీఎం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీపావళి పండగను తిత్లీ బాధితుల మ‌ధ్య జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. దసరా పండగను వారి మధ్యే చేసుకున్న సీఎం.. దీపావళిని సైతం అక్కడే జరుపుకోవాలని నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో నిర్వహించే దీపావళి వేడుకల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. ఇందుకోసం సతీ సమేతంగా మంగ‌ళ‌వారం సాయంత్రం చంద్రబాబు శ్రీకాకుళానికి బయలుదేరారు. హుద్‌హుద్‌ తుపాను సమయంలోనూ విశాఖలోనే సీఎం దీపావళిని జరుపుకున్నారు. ప్రజల కంటే పండగలు ముఖ్యం కాదని మీడియా ప్రతినిధులతో సీఎం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news