భారత లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ రోహిత శర్మ క్రీడాకారులకు ఇచ్చే దేశ అత్యున్నత స్థాయి పురస్కారం రాజీవ్ ఖేల్‌రత్నకు ఎంపికయ్యాడు. రోహిత్‌తోపాటు ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ వినేష్ ఫోగట్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బాత్రా, పారాలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ మరియప్పన్ తంగవేలులు కూడా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈమేరకు మంగళవారం సెలెక్షన్ ప్యానెల్ సమావేశమై ఆ నలుగురు క్రీడాకారులను ఆ పురస్కారానికి ఎంపిక చేసింది.
కాగా రాజీవ్ ఖేల్‌రత్న పురస్కారాన్ని నాలుగేళ్ల కాలంలో క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి అందజేస్తారు. ఇక రోహిత్ శర్మ ఈ పురస్కారానికి ఎంపిక కావడంతో ఈ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో 1998లో సచిన్‌కు మొదట ఈ పురస్కారం అందజేశారు. తరువాత 2007లో ధోనీకి, 2018లో విరాట్ కోహ్లికి ఈ పురస్కారం దక్కింది. రోహిత్ శర్మ 2019లో వరల్డ్ కప్‌లో 9 మ్యాచుల్లో ఏకంగా 648 పరుగులు చేసి అత్యధిక రన్స్ చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అదే టోర్నీలో అతను ఏకంగా రికార్డు స్థాయిలో 5 సెంచరీలు నమోదు చేశాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టు తరఫున రోహిత్ ఎన్నో రికార్డులను సాధించాడు. గత నాలుగేళ్ల కాలంలో అతను క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. కాగా హిట్ మ్యాన్ గా పిలవబడే రోహిత్ శర్మ ఇప్పటి వరకు 32 టెస్టులు, 224 వన్డేలు, 108 టీ20లను ఆడాడు. టెస్టుల్లో 2,141 రన్స్ చేయగా, వన్డేల్లో 9,115 పరుగులు, టీ20లలో 2,773 పరుగులు చేశాడు.