రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలోని 5 రాష్ట్రాల్లో కొవిడ్ టెస్టులు తక్కువగా ఉన్నాయని.. అందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉందని ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ డెక్కన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాస్మా బ్యాంకును ఆయన ప్రారంభించారు.
తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి ప్లాస్మా బ్యాంక్‌ను ఇవాళ ప్రారంభించినట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టిన రోటరీ క్లబ్‌కు అభినందనలు తెలిపారు. ప్లాస్మా థెరపీతో చాలా మంది ప్రాణాలు రక్షించగలుగుతున్నామని.. ఈ విషయంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా ఈ విషయంలో చొరవ తీసుకున్న సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్‌ను ఆయన అభినందించారు.
కరోనా టెస్టుల విషయంలో రాష్ట్రం కింది నుంచి ఏడో స్థానంలో ఉందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. వాటిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మన నిర్లక్ష్యమే మనకు శిక్ష.. మన జాగ్రత్తే మనకు శ్రీరామరక్ష అని వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇప్పటి వరకు 14 లక్షల ఎన్-95 మాస్కులు, 2.41 లక్షల పీపీఈ కిట్లు, 1400 వెంటిలేటర్లు అందజేసినట్లు ఆయన వివరించారు.