పవన్ కళ్యాణ్ డిమాండ్.. అవసరమైతే సీబీఐ దర్యాప్తు..!

-

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో జరిగిన అగ్నిప్రమాదం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. మొన్న పిఠాపురం, కొండబిట్రగుంట ఇప్పుడు అంతర్వేది. ఈ ఘటనలన్నీ యాదృచ్ఛికాలు కావన్నారు. మతిస్థిమితం లేనివారి పని, తేనె పట్టు కోసం చేసిన పని అని చెబుతుంటే పిల్లలు కూడా నవ్వుతారని అసహనం వ్యక్తంచేశారు. పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం సమయంలోనే సరిగా స్పందిస్తే ఇలాంటివి జరిగేవా? అని ఏపీ ప్రభుత్వాన్ని జనసేనాని ప్రశ్నించారు. ఈ విషయంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని సర్కారుని డిమాండ్ చేశారు పవన్.

ఒకవేళ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే సీబీఐ దర్యాప్తు కోసం కేంద్రాన్ని కోరతామని చెప్పిన పవన్.. ఉగ్రవాద కోణం ఉన్నట్టయితే ఎన్ఐఏ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. అలాగే విశ్వాసాలను దెబ్బతీస్తున్న తీరుపై ఆడపడుచులందరూ మంగళ, శుక్రవారాల్లో హారతులిస్తూ తమ నిరసన తెలపాలని పవన్ పిలుపునిచ్చారు. కాగా, ఆలయ ప్రాంగణంలోని భారీ రథం శనివారం రాత్రి అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. షెడ్డులో ఉన్న రథానికి మంటలు అంటుకొని ఒక్కసారిగా ఎగిసిపడటంతో రథం పూర్తిగా కాలి బూడిదైంది. 40 అడుగుల ఎత్తున్న ఈ రథాన్ని 60 ఏళ్ల క్రితం పూర్తి టేకు కలపతో తయారు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news