లక్ష దాటిన కరోనా మృతుల సంఖ్య

-

దేశంలో కరోనా వైర‌స్ విజృంభిస్తూనే ఉంది. ఈ ఏడాది జనవరిలో భారత్‌లోకి ప్రవేశించిన కొవిడ్ మ హమ్మారి.. ప్రజలపై పంజా విసురుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులతోపాటు మృతుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన గ‌ణాంకాల ప్ర‌కారం దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య లక్ష దాటడం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ప్రపంచంలో అమెరికా, బ్రెజిల్‌ తర్వాత లక్ష మందిపైగా ప్రాణాలు కోల్పోయినది భారత్‌లోనే. ఇందులో మహారాష్ట్రలోనే 37 శాతం (37,480) మరణాలు నమోదయ్యాయి. తమిళనాడు (9,653), కర్ణాటక (9,119) లలో పది వేలకు చేరువలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌ (5,917), ఆంధ్రప్రదేశ్‌ (5,900) తర్వాత స్థానాల్లో నిలిచాయి. మొత్తం మరణాల్లో ఈ ఐదు రాష్ట్రాల్లోనే 67.5 శాతం ఉండటం గమనార్హం.

కొవిడ్‌ ధాటికి ఇప్పటి వరకు భార‌త్‌లో 1,00,842 ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 79,476 మందికి వైరస్‌ సోకిందని, 1,069 మంది చనిపోయారని తెలిపింది. మరోవైపు మరణాల రేటు కొన్ని రోజులుగా 1.56 వద్ద నిలకడగా ఉంటోంది. ఇది ప్రపంచ సగటు (2.97)తో పోలిస్తే చాలా తక్కువని కేంద్రం పేర్కొంది. గత 24 గంటల్లో 75,628 మంది కోలుకున్నారని.. ప్రపంచ కేసుల్లో భారత్‌ వాటా 18.6 శాతం కాగా, రికవరీలు 21 శాతమని వివరించింది.
కాగా దేశంలోని తాజా మరణాల్లో 40 శాతం, కేసుల్లో 25 శాతం మహారాష్ట్రలోనే నమోదవుతుండ‌టం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news